: మోదీని కలిసిన అనంతరం, శశికళా నటరాజన్ పేరెత్తని పన్నీర్ సెల్వం
జయలలిత మరణించిన తరువాత తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పన్నీర్ సెల్వం, తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి చర్చలు జరిపిన వేళ, ఆమెకు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలని మాత్రమే కోరినట్టు తెలుస్తోంది. వీరిద్దరి చర్చల్లో జయలలిత నెచ్చెలి శశికళా నటరాజన్ పేరు ప్రస్తావన రాలేదని తెలుస్తోంది. దేశానికి 32 సంవత్సరాల పాటు సేవ చేసిన జయలలిత భారతరత్న పురస్కారానికి అర్హురాలని పన్నీర్ సెల్వం, మోదీకి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆపై బయటకు వచ్చిన ఆయన్ను మీడియా చుట్టుముట్టి, శశికళా నటరాజన్ గురించి ప్రశ్నించగా, ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు.
కాగా, పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, పార్టీ జనరల్ సెక్రటరీగా శశికళ ఉండాలని లోక్ సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురైతో కలసి పన్నీర్ సెల్వం కోరిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్న వేళ, మంత్రులు ఆర్బీ ఉదయ్ కుమార్, కదంబూర్ రాజు, సేవూర్ ఎస్ రామచంద్రన్ లు, పలువురు ఏఐఏడీఎంకే నేతలు శశికళ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలన్న కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చిన వేళ, పన్నీర్ సెల్వం ప్రధానిని కలవడం కొంత చర్చనీయాంశమైంది.