: ఆ యువతి తల తెస్తే మిలియన్ డాలర్ల బహుమతి: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల భారీ ఆఫర్
ఆ యువతి పేరు జోనా పలాని. వయసు 23 సంవత్సరాలు. 2014లో యూనివర్శిటీ చదువును ఆపివేసి, సిరియా, ఇరాక్ దేశాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడేందుకు తుపాకీ పట్టిన ధీర వనిత. ఆపై తన అసమాన ధైర్య సాహసాలతో కుర్దిష్ - దానిష్ మహిళా సైన్యంలో కీలకంగా ఎదిగింది. ఆపై జూన్ 2015లో దేశాన్ని వీడి డెన్మార్క్ లోకి ప్రవేశించి, పోలీసులకు చిక్కి ప్రస్తుతం కోపెన్ హాగెన్ జైల్లో ఉంది. ఓ ఉగ్రవాద దేశం నుంచి వచ్చి, భద్రతా దళాలకు పట్టుబడ్డ కేసులో ఇరుక్కున్న ఆమెపై విచారణ నేటి నుంచి ప్రారంభం కానుండగా, నేరం నిరూపితమైతే రెండేళ్ల వరకూ శిక్ష పడవచ్చు.
ఇక ఆమె సిరియా, ఇరాక్ లలో యుద్ధంలో పాల్గొన్న సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, ఇప్పుడామె తలపై మిలియన్ డాలర్ల బహుమానాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని అరబ్ మీడియా వెల్లడించింది. సోషల్ మీడియాలోని వివిధ చానళ్లలో జోనా పలానీ తలపై రివార్డును ప్రకటిస్తూ ప్రకటనలు వెలువడ్డాయని తెలుస్తోంది. కాగా, "డెన్మార్క్ లేదా మరో దేశానికి నేను ఎలా కీడు చేస్తానని అనుకొంటున్నారు? ఓ దేశ అధికార సైన్యంలో నేను భాగస్వామిని. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై యుధ్ధానికి డెన్మార్క్ మద్దతిస్తూ, సైన్యానికి శిక్షణ కూడా ఇస్తోంది కదా? నాపై అభియోగాలేంటి?" అని జోనా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ప్రశ్నలు సంధించింది.
తొలి గల్ఫ్ వార్ జరుగుతున్న సమయంలో రమది లోని ఓ రెఫ్యూజీ క్యాంఃపులో ఇరాన్ నుంచి వచ్చి తలదాచుకున్న కుర్దిస్థాన్ జంటకు జోనా జన్మించింది. రాజనీతి శాస్త్రంలో డిగ్రీ విద్యను అభ్యసిస్తూ, ఉగ్రవాదులపై పోరాడేందుకు చదువును పక్కనబెట్టింది. కుర్దిష్ పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్స్ లో చేరి పోరాడింది. మహిళా హక్కులను కాపాడేందుకు ముందడుగు వేసిన ఆమెను జైల్లో ఉంచడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెను విడుదల చేసి ఉగ్రవాదుల నుంచి కాపాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.