: అస్వస్థతతో ఉన్నా జయలలిత ముఖంలో చిరునవ్వు కనిపించేది!: అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్ సమస్యలతో అపోలో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరినప్పటి నుంచి తాను నిత్యమూ ఆమెను పరిశీలిస్తూ వచ్చానని, అయితే, ఆమెకు గుండెపోటు వస్తుందన్న సంకేతాలు తమకు ఎన్నడూ అందలేదని అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి వ్యాఖ్యానించారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, పూర్తిగా కోలుకునే స్థితిలో ఉన్న ఆమె హఠాత్తుగా గుండెపోటు రావడంతోనే మృత్యువాత పడ్డారని స్పష్టం చేశారు.
ఆసుపత్రిలో చికిత్సకు ఆమె చక్కగా స్పందించారని, అస్వస్థతతో ఉన్నా ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించేదని గుర్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 22న ఆమె ఆసుపత్రిలో చేరిన క్షణం నుంచి ఆమెకు జరిగిన చికిత్సలన్నింటినీ తాను దగ్గరుండి పరిశీలించానని, రెండు నెలల పాటు తాను చెన్నై వీడి వెళ్లలేదని ప్రతాప్ సి రెడ్డి పేర్కొన్నారు. శక్తికి మించి చేయాల్సిన చికిత్సలన్నింటినీ ఆమెకు అందించామని వెల్లడించారు.
ఆమెను డిశ్చార్జ్ చేసే సమయం వచ్చిందని భావిస్తున్న సమయంలో గుండెపోటు వచ్చిందని, విషయం తెలియగానే తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యానని ఆయన అన్నారు. అప్పటిదాకా ఆమెకు గుండెపోటు వచ్చేందుకు ఎలాంటి సూచనలు కనిపించలేదని, ఆపై ‘గోల్డెన్ అవర్’గా వైద్యులు పరిగణించే సమయంలోనూ, ఇంటర్నేషనల్ స్థాయి వైద్య చికిత్సలు అందించామని, వెంటనే 'ఎక్మో' అమర్చినా, ఆమె ప్రాణాలు నిలబడలేదని తెలిపారు.