: జనవరి నెలాఖరు వరకు కరెన్సీ కష్టాలే!: తేల్చిచెప్పిన ఎస్బీఐ అధ్యయనం
పెద్దనోట్ల రద్దు తరువాత ప్రజలను చుట్టుముట్టిన కష్టాలు వీడేందుకు మరింత సమయం పట్టేట్టు కనిపిస్తోంది. ఈ విషయం ఎస్బీఐ అధ్యయనంలో వెల్లడైంది. ఎస్బీఐ చేసిన అధ్యయనం ప్రకారం కొత్త నగదు పూర్తి స్థాయిలో చలామణిలోకి వచ్చేందుకు ఇంకా రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి నెలాఖరు వరకు కరెన్సీ కష్టాలు తప్పవని, ఫిబ్రవరి నుంచి సాధారణ స్థాయి నెలకొనే అవకాశం ఉందని తెలిపింది.
కొత్త నోట్ల ముద్రణ వేగంగా జరుగుతోందని తెలిపిన ఎస్బీఐ నివేదిక, డిసెంబర్ చివరి నాటికి 50శాతం, జనవరి నెలాఖరుకు 75 శాతం కరెన్సీ కష్టాలు తీరుతాయని, ఫిబ్రవరి చివరి నాటికి 78-88శాతం కరెన్సీ సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేస్తోంది. ఇందులో చాలా వరకు చిన్న నోట్లు అందుబాటులోకి రానుండడంతో కరెన్సీ కష్టాలు తీరిపోయే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో వ్యవసాయాధారిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, పంజాబ్, హర్యాణా, గుజరాత్ లలో మాత్రం మరింత కాలం కరెన్సీ కష్టాలు కొనసాగుతాయని ఈ నివేదిక వెల్లడించింది.