: వచ్చే వారంలో పెరగనున్న రైల్వే టికెట్ ధరలు... క్యాబినెట్ ముందుకు ఫైల్!
వివిధ వర్గాలకు తగ్గింపు ధరలకు రైల్వే టికెట్లను అందిస్తున్న కారణంగా సాలీనా రూ. 33 వేల కోట్లను నష్టపోతున్న భారత రైల్వే, సబ్సిడీ భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా ప్రయాణికులపై భారం మోపాలని భావిస్తోంది. 2017 ఆరంభం నుంచి ప్రయాణ చార్జీలను పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2013లో టికెట్ ధరలను పెంచినప్పటికీ, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. అయితే, 2014లో ప్రయాణ చార్జీలను 14.2 శాతం, సరకు రవాణా చార్జీలను 6.5 శాతం మేరకు ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. ఆపై మరో విడత పెంపుదల తెరపైకి రాలేదు.
ఇక ఇప్పుడు ధరలను పెంచేందుకు అనుమతించాలని కోరుతూ రైల్వే శాఖ కేంద్ర క్యాబినెట్ కు ఫైల్ ను పంపినట్టు తెలుస్తోంది. టికెట్ ధరల పెంపునకు పార్లమెంట్ అనుమతులు అవసరం లేకపోవడంతో, క్యాబినెట్ నుంచి అనుమతి లభించిన వెంటనే ధరలను పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. వచ్చే వారంలో సమావేశమయ్యే కేంద్ర మంత్రివర్గం రైలు టికెట్ ధరల పెంపును సమర్థిస్తూ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. ఆ వెంటనే ధరల పెరుగుదలపై ప్రకటన వెలువడుతుందని, సాధారణ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ను విలీనం చేయాలన్న నిర్ణయం తీసుకున్న తరువాత, రైల్వే శాఖకు సంబంధించి తీసుకోబోయే అతి ముఖ్య నిర్ణయాల్లో ఇదొకటని కేంద్ర అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.