: చదరపు మీటరుకు రూ. 8.8 లక్షలు... రూ. 435 కోట్లు పెట్టి భవనాన్ని కొన్న డీఎల్ఎఫ్ చైర్మన్ కుమార్తె
న్యూఢిల్లీలోని అత్యంత ఖరీదైన ప్రాతాల్లో ఒకటిగా పేరున్న లుత్యన్స్ ప్రాంతంలో నిర్మాణ రంగ దిగ్గజం డీఎల్ఎఫ్ చైర్మన్ కేపీ సింగ్ కుమార్తె రేణుకా తల్వార్ రూ. 435 కోట్లను వెచ్చించి ఓ భవంతిని కొనుగోలు చేశారు. లుత్యన్స్ ప్రాంత చరిత్రలో నమోదైన అతిపెద్ద డీల్స్ లో ఇదొకటని తెలుస్తోంది. మరో నిర్మాణ రంగ సంస్థ టీడీఐ ఇన్ ఫ్రాకార్ప్ ఎండీ కమల్ తనేజా నుంచి రేణుక ఈ భవనాన్ని కొనుగోలు చేశారు. మొత్తం 4,925 చదరపు మీటర్ల విస్తీర్ణమున్న ప్లాట్ లో, 1,189 చదరపు మీటర్లలో భవంతి నిర్మితమై ఉండగా, దీని ప్రస్తుత విలువ రూ. 383 కోట్లని అంచనా.
ప్రస్తుత విలువపై అధికంగా వెచ్చించిన రేణుక, ఒక్కో చదరపు మీటరుకు రూ. 8.8 లక్షల చొప్పున చెల్లించారు. డీఎల్ఎఫ్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీఎస్ తల్వార్ ను రేణుక వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. లుత్యన్స్ ప్రాంతంలో కేపీ సింగ్ పేరిట ఇప్పటికే రెండు బంగళాలు ఉన్నాయి. సెంట్రల్ ఢిల్లీలోని ఈ ప్రాంతంలో దాదాపు 1000 భవనాలు ఉండగా, వాటిల్లో 60 నుంచి 70 మాత్రమే ప్రైవేటు వ్యక్తుల వాడకానికి అందుబాటులో ఉన్నాయి. దాదాపు 3 వేల ఎకరాల్లో, 28.73 కిలోమీటర్ల విస్తీర్ణంలో లుత్యన్స్ బంగళా జోన్ ఉంది. ఈ ప్రాంతంలోని భవనాల్లో 900కు పైగా భవనాలు కేంద్ర మంత్రులు, ప్రభుత్వ అధికారులకు ఆతిథ్యమిస్తుంటాయి.