: నోట్ల రద్దుపై పార్లమెంటరీ కమిటీకి వివరించేందుకు సిద్ధమవుతున్న ఉర్జిత్ పటేల్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా ఉండి, నోట్ల రద్దు తరువాత, మీడియా ముందుకు వచ్చి వివరణలు ఇవ్వలేదన్న విమర్శలు ఎదుర్కొంటున్న ఉర్జిత్ పటేల్, పార్లమెంటరీ ఆర్థిక కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వనున్నారు. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు, తదనంతరం నెలకొన్న పరిస్థితులపై కమిటీ ముందు 22వ తేదీన ఉర్జిత్ ప్రసంగించనున్నారని పార్లమెంట్ వెబ్ సైట్ వెల్లడించింది. పార్లమెంట్ అనెక్స్ బిల్డింగ్ లో గురువారం ఉదయం 11 గంటలకు ఉర్జిత్ వివరణ ఉంటుందని తెలిపింది.
కాగా, పెద్ద నోట్ల రద్దు తరువాత, ప్రజలకు పలు వెసులుబాటు చర్యలను ఆర్బీఐ ప్రకటించినప్పటికీ, సాధారణ ప్రజలకు కష్టాలు మాత్రం తగ్గలేదు. మరోవైపు మార్కెట్లోకి వస్తున్న నగదులో అత్యధిక భాగం కొద్ది మంది చేతుల్లోకి వెళుతున్నాయన్న విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఉర్జిత్ వివరణపై ఆసక్తి నెలకొంది. తమ వద్ద సరిపడా నగదు నిల్వలు ఉన్నాయని ఆర్బీఐ చెబుతున్నప్పటికీ, ఆ నగదు బ్యాంకులకు చేరని పరిస్థితి. మొత్తం విషయాలపై ఆర్బీఐ గవర్నర్ హోదాలో ఉర్జిత్ స్పష్టతనిచ్చే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది.