: టాప్ హీరో ఎవరు?... తెలుగు సినీ అభిమానుల మధ్య గూగుల్ రేపిన వివాదం!
సామాజిక మాధ్యమాల సాక్షిగా తెలుగు సినీ హీరోలను అమితంగా అభిమానించే ఫ్యాన్స్ మధ్య చిచ్చు రగిలింది. శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీలు అంతరించిపోయి, యూట్యూబ్ వ్యూస్, సోషల్ మీడియా షేర్, లైక్ రికార్డులకు ప్రాధాన్యత ఇస్తున్న ఈ తరుణంలో, గూగుల్ ప్రకటించిన ‘మోస్ట్ సెర్చ్ డ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ జాబితాలో తమ హీరో టాప్ అంటే తమ హీరో టాప్ అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వాదులాడుకుంటున్నారు. ఈ సంవత్సరం గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన హీరోల లిస్ట్ అంటూ, గూగుల్ ఓ ప్రకటనను విడుదల చేసినప్పటి నుంచి ఈ వివాదం మొదలైంది.
జాబితాలో అల్లు అర్జున్ టాప్ లో ఉండగా, రెండవ స్థానంలో మహేష్, మూడవ ప్లేస్ లో ప్రభాస్, నాల్గవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారని, ఐదవ స్థానానికి పవన్ కల్యాణ్ పరిమితమైనట్టు సెర్చింగ్ ట్రెండ్స్ చెబుతుండటమే మొత్తం వివాదానికి కారణం. ఇక ఈ ఏటి టాప్ సెర్చింగ్ హీరోలంటూ విడుదలైన మరో ప్రకటనలో జూనియర్ ఎన్టీఆర్ పేరు మొదటి స్థానంలో వచ్చింది.
ఇక పవన్ గురించి గూగుల్ లో వెతికేవారు, పవర్ స్టార్ అని, పవన్ కల్యాణ్ అని పలు రకాల సెర్చ్ వర్డ్స్ ఉపయోగిస్తుండటం వల్ల, తమ హీరోకు గూగుల్ సెర్చ్ లో టాప్ పొజిషన్ దక్కలేదన్నది పవన్ అభిమానుల వాదన. ఇదే సమయంలో 2016 ముగిసేందుకు మరో 11 రోజులు ఉండటం, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ల మధ్య తేడా ఒక్క శాతం మాత్రమే ఉండటంతో, పొజిషన్స్ మారిపోతాయని మరికొందరు వాదిస్తున్నారు.
ఏమైనా, ఈ విషయం మాత్రం ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారి, వివాదాన్ని రాజేసింది!