: హైదరాబాద్‌లో కేబీఎస్ బ్యాంకు ఎండీపై కాల్పులు... ఇంట్లోకి వెళ్లి డబ్బు, బంగారం డిమాండ్
హైదరాబాద్‌లో మరోమారు కాల్పులు కలకలం రేపాయి. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 19 బ్రాంచులున్న కృష్ణ బీమా సమృద్ధి బ్యాంకు(కేబీఎస్) సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ అయిన మన్మతదలై(60)పై దుండగుడు రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. మాసబ్‌ట్యాంకులో ఆదివారం పట్టపగలు జరిగిన ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. దుండగుడి కాల్పుల్లో ఓ తూటా మన్మతదలై మోకాలి కిందభాగంలోకి దూసుకుపోయింది. కాల్పుల అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
పోలీసుల కథనం ప్రకారం.. మాసబ్‌ట్యాంకులోని శాంతినగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లోని 101 ప్లాట్‌లో మన్మతదలై ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం గుర్తుతెలియని యువకుడు(30) వచ్చి సెక్యూరిటీ గార్డుతో సార్‌ను కలవాలని చెప్పాడు. సార్‌పైన ఉన్నారని చెప్పి అతడిని లోపలికి తీసుకెళ్లాడు. మన్మతదలైని కలిసిన యువకుడు తనకు డబ్బు, బంగారం కావాలంటూ హిందీలో డిమాండ్ చేశాడు. బెడ్‌రూంలోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న మన్మతదలైపై కాల్పులు జరిపాడు. మోకాలిలోకి తూటా దూసుకెళ్లడంతో కుప్పకూలిన ఆయన కేకలు వేశారు. దీంతో పరిగెత్తుకుంటూ వచ్చిన సెక్యూరిటీగార్డును ఆగంతుకుడు తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మన్మతదలైని స్థానికులు కేర్ ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి, వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యక్ష సాక్షులు, బాధితుడి భార్యను అడిగి వివరాలు సేకరించారు. పథకం ప్రకారమే ఆగంతుకుడు తుపాకితో వచ్చాడని ప్రాథమికంగా తేల్చిన పోలీసులు ఈ ఘటన వెనక ఆర్థిక అంశాలు, పాతకక్షలు ఏమైనా ఉన్నాయా? అనే అంశంపై దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పేర్కొన్నారు.