: ఫేస్‌బుక్‌ పరిచయం... యువకుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమ్మాయి


సామాజిక మాధ్యమాల ప్రభావం యువతపై ఎంతగా ఉందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. వాటి ద్వారానే ప్రేమ‌లో ప‌డుతూ త‌మ జీవితాన్ని నాశ‌నం చేసుకుంటున్నారు. తాము చాటింగ్ చేస్తోన్న వ్య‌క్తి ఎటువంటి వాడో, ఏం చేస్తుంటాడో కూడా తెలియ‌కుండా అమ్మాయిలు దారుణంగా మోస‌పోతున్నారు. ఇటువంటి ఘ‌ట‌నే తాజాగా చెన్నైలో చోటుచేసుకుంది. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన యువకుడి కారణంగా ఓ అమ్మాయి మృతి చెందింది.

వివ‌రాల్లోకి వెళితే... మూడు రోజుల‌ క్రితం ఓ లాడ్జి గదిలో అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందింది. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న‌ పోలీసులు దీనిని హత్యగా తేల్చారు. ఆ యువ‌తి మృతిపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించి ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. అతడి మిత్రుడి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.

ఈ కేసుపై పోలీసులు మాట్లాడుతూ...  మైలాపూర్‌ ఆర్‌కే ప్రధాన రోడ్డులోని ఓ ప్రైవేటు లాడ్జి గదిలో అనుమానాస్పద స్థితిలో నివేద అనే యువతి ప్రాణాలు కోల్పోయింద‌ని పేర్కొన్నారు. నివేదకు ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌య‌మైన మదురై కూడల్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తితో ఫోనులో గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడేదని, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి ఆరా తీయ‌గా నివేద‌, అత‌డు ప్రేమించుకున్నట్లు తెలిసిందని చెప్పారు.

నివేద‌ను కలవడానికి ఈ నెల 14న అత‌డు చెన్న‌య్‌కి వచ్చాడని పోలీసులు తెలిపారు. అనంత‌రం వారిరువురూ మైలాపూర్‌లోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారని, కొద్ది సేప‌టి త‌రువాత నివేద స్నేహితుడు కూడా లాడ్జిలోకి వచ్చాడని చెప్పారు. ఈ స‌మ‌యంలో ఆ ముగ్గురి మధ్య గొడవ చెల‌రేగింద‌ని, ఈ క్ర‌మంలోనే నివేదను ఆమె ప్రియుడు, అత‌డి స్నేహితుడు క‌లిసి గొంతు నులిమి చంపేశార‌ని పోలీసులు పేర్కొన్నారు. అనంత‌రం వారిరువురూ లాడ్జి నుంచి పారిపోయినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News