: ఉద్యోగులకు కార్లు ఇచ్చాడు... కానీ, ఈపీఎఫ్ ఎగ్గొట్టాడు!
గుజరాత్ లోని సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్ జీ ధోలాకియా గురించి తెలియని వారుండరు. రూ.6,000 కోట్ల టర్నోవర్ తో కూడిన హరే కృష్ణ ఎక్స్ పోర్ట్స్ కంపెనీ చైర్మన్ ఆయన. ఓ సంస్థ అధిపతిగా ఉద్యోగుల పట్ల పెద్ద మనసు చాటుకుంటూ ఆయన పలు మార్లు వార్తల్లోకి ఎక్కారు. దీపావళి బోనస్ కింద 2014లో ఆయన తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు 491 కార్లు, 207 ఫ్లాట్స్, ఆభరణాలను కానుకగా ఇచ్చాడు. మరి ఉద్యోగుల విషయంలో ఇంత చేస్తున్న ఆయన వారి సంక్షేమంలో భాగమైన ఉద్యోగుల భవిష్యనిధి సంస్థకు చందాలు చెల్లించడం లేదన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
రూ.16.66 కోట్ల రూపాయల మేర ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ కు ఆయన చెల్లించాల్సి ఉంది. విషయం ఏమిటంటే, ఆయన కంపెనీలో 3,165 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ, 17 మంది ఉద్యోగులనే ఈపీఎఫ్ పరిధిలో చూపిస్తూ మిగిలిన వారికి అసలు ఈపీఎఫ్ ప్రయోజనాలు కల్పించడం లేదని అధికారులు గుర్తించారు. దీంతో సూరత్ లోని ఈపీఎఫ్ వో కార్యాలయం రెండేళ్ల దర్యాప్తు అనంతరం ఫైనల్ డిమాండ్ నోటీసును తాజాగా జారీ చేసింది. రూ.16.66 కోట్లను 12 శాతం వార్షిక వడ్డీతోపాటు వార్షిక నష్టాల కింద మరో 25 శాతం చొప్పున 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది.