: నిత్య పెళ్లికుమార్తె.. ఇప్పటికి 11 మందిని మోసగించిన కి'లేడీ'!


‘పెళ్లి చేసుకుని, ఇల్లు దోచుకుని’ అన్న చందంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 28 ఏళ్ల ఓ మహిళ ధనార్జనకు వివాహాన్ని వృత్తిగా ఎంచుకుంది. వరుసబెట్టి 11 మంది జీవితాల్లోకి అర్ధాంగిగా ప్రవేశించింది. ఒకరి తర్వాత ఒకరిని లూటీ చేస్తున్న ఈ కిలేడీని ఎట్టకేలకు పోలీసులు నోయిడాలో అరెస్ట్ చేశారు. ఆమె పేరు మేఘా భార్గవ్. ఉండేది నోయిడాలోని అమ్రపాలి జోడియాక్ సొసైటీలో. పోలీసుల కథనం ప్రకారం... భార్గవ్ తగిన పరిశోధన అనంతరం సంపన్నుడైన యువకుడ్ని ఎంచుకుంటుంది. అందులోనూ వివాహానికి ప్రతికూలతలతో ఉన్నవారిని గుర్తిస్తుంది.

డబ్బులుండీ, పెళ్లికి శారీరక లోపం, నల్లగా ఉండి పెళ్లి కుదరకపోవడం, ఇంకా మరేదైనా లోపంతో బాధపడుతున్న వారిని ఎంచుకున్న తర్వాత వారిని ముగ్గులోకి దింపుతుంది. చక్కగా పెళ్లి చేసుకుని వారితో స్వల్ప కాలం పాటు వైవాహిక జీవితం గడుపుతుంది. ఒకానొక శుభ ముహూర్తాన మొగుడికి మత్తు మందు కలిపిన పానీయం తాగించి ఇంట్లో ఉన్న సంపదనంతా ఊడ్చుకుని పరారవుతుంది.

‘భార్గవ్ చూడ్డానికి అందంగా ఉంటుంది. దీంతో ఆమె వేసే ముగ్గులోకి ఎవరైనా పడిపోవాల్సిందే’ అని ఇన్ స్పెక్టర్ సునీల్ పేర్కొన్నారు. డబ్బులు దండిగా ఉన్న వారిని ఎంచుకోవడంలో భార్గవ్ కు మహేంద్ర అనే వ్యక్తి సహాయకుడిగా పనిచేస్తున్నాడు. భార్గవ్ కేరళలోని కోచికి చెందిన లోరెన్ జస్టిన్ ను సైతం ఇలానే మోసం చేసింది. దీంతో గత అక్టోబర్ లో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లయిన తర్వాత తన భార్య రూ.15 లక్షల ఆభరణాలతో పరారైందని  ఫిర్యాదులో పేర్కొన్నాడు. తగిన దర్యాప్తు అనంతరం కేరళ పోలీసులు భార్గవ్ ఉండేది నోయిడాలో అని తెలుసుకున్నారు. స్థానిక పోలీసుల సాయంతో శనివారం భార్గవ్ తోపాటు ఆమె సోదరి ప్రాచి, బావ దేవేంద్ర శర్మలను అరెస్ట్ చేశారు. 

  • Loading...

More Telugu News