: రూ.9 వేల కోట్లు.. జస్ట్ ఐదు రోజుల్లో కోఆపరేటివ్ బ్యాంకుల్లో జమ అయిన సొమ్ము
పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలోని 17 రాష్ట్రాల్లోని కోఆపరేటివ్ బ్యాంకుల(డీసీసీబీ)లో నవంబరు 10 నుంచి 15 వరకు ఐదు రోజుల్లో ఏకంగా రూ.9 వేల కోట్లు జమ కావడాన్ని చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు. డీసీసీబీల పనితీరు పూర్తిగా నీరసించిపోయి అప్పుల్లో కూరుకుపోతున్న వేళ పెద్ద నోట్ల రద్దు తర్వాత కోట్లాది రూపాయలు వచ్చిపడడంతో వాటికి ప్రాణం లేచివచ్చినట్టయింది. రాజకీయ నేతల కనుసన్నల్లో పనిచేసే ఈ బ్యాంకుల్లో చాలామంది నేతలు రైతుల పేరుతో ఖాతాలు తెరుస్తున్నారన్న విషయం బహిరంగ రహస్యం. ఐదు రోజుల్లో ఇంత పెద్దమొత్తంలో ఆయా బ్యాంకుల్లోకి రద్దయిన పెద్ద నోట్లు జమకావడం వెనక ఇదే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వ్యవసాయం పతనావస్థకు చేరుకున్న కేరళలోని డీసీసీబీల్లో నవంబరు 10-15 మధ్య ఏకంగా రూ.1800 కోట్లు జమకావడాన్ని చూసి అధికారులు నోరెళ్లబెడుతున్నారు. పంజాబ్లో ఉన్న 20 పై చిలుకు డీసీసీబీల్లో రూ.1268 కోట్లు, మహారాష్ట్రలో రూ.1,128 కోట్లు జమ అయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో రైతులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తీసుకున్న రుణాలే చెల్లించలేని స్థితిలో ఉన్నారు. అటువంటిది అక్కడి డీసీసీబీల్లో ఏకంగా రూ. వందకోట్లు జమకావడం రాజకీయ నాయకుల ప్రమేయానికి అద్దం పడుతోందని రాష్ట్ర వ్యవసాయ విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.