: స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీల్లా ఏయూను తయారుచేస్తా.. చంద్రబాబునాయుడు


ప్రపంచానికి మేధావులను అందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీల తరహాలో విశాఖపట్టణంలోని ఆంధ్రాయూనివర్సిటీని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఉన్నానని, దీనికి విద్యార్థుల మద్దతు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఏయూలో చదువుకుని వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు కూడా ఈ విషయంలో తనకు తోడ్పాటు అందించాలని కోరారు. శనివారం ఏయూలో నిర్వహించిన పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీలు ప్రపంచానికి మేధావులను అందిస్తున్నాయన్నారు. ఆ తరహాలోనే రాష్ట్రంలోని యూనివర్సిటీలను కూడా తయారు చేయాలనే సంకల్పంతో ఉన్నానని అన్నారు. విద్యార్థుల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పై యూనివర్సిటీలు ప్రవేశాలు కల్పిస్తాయన్నారు. అటువంటి వారందరికీ గుణాత్మక విద్యను అందించడం ద్వారా ప్రపంచ స్థాయి మేధావులుగా వారిని తీర్చిదిద్దుతున్నాయన్నారు.

యూనివర్సిటీలో తాము చదువుకునే రోజుల్లో క్లాసు రూం కంటే క్యాంటీన్, సైకిల్ స్టాండ్‌లలోనే ఎక్కువగా గడిపేవాళ్లమని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తాము కాలక్షేపం కోసం యూనివర్సిటీలో చేరితే, ఇప్పటి యువత ఉన్నత లక్ష్యాలతో చేరుతోందన్నారు. ఇకముందు కూడా ఇదే కొనసాగాలని అభిలషించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘానికి ప్రభుత్వం తరపున రూ. 10 కోట్ల కార్పస్ ఫండ్ ఇస్తున్నట్టు ప్రకటించారు. సంఘంలోని మిగతా సభ్యులు కూడా కలిసొస్తే రూ.వంద కోట్లు సమీకరించడం పెద్ద కష్టమేమీ కాదని చంద్రబాబు అన్నారు. ఏయూ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారుచేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావుకు సీఎం సూచించారు.

  • Loading...

More Telugu News