: ట్రంప్ ప్రవేశపెట్టాలనుకున్న ‘రిజిస్టర్’ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించం!: ప్రముఖ సంస్థల టెక్కీల ప్రతిజ్ఞ
అమెరికాకు వలస వచ్చిన ముస్లిం ఉద్యోగులను ప్రత్యేకంగా గుర్తించేందుకు గాను కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టాలనుకుంటున్న‘రిజిస్టర్’ విధానంపై అప్పుడే నిరసనలు మొదలయ్యాయి. మతాన్ని ఆధారంగా చేసుకుని వ్యక్తులను వెనక్కి పంపించే ఆలోచనను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సంస్థలు గూగుల్, ట్విట్టర్ సహా పలు టెక్నాలజీ సంస్థలకు చెందిన సుమారు 1200 మంది టెక్కీలు ఈ మేరకు ప్రతిజ్ఞ చేశారు.
అమెరికాలోని ముస్లింలు అందరికీ తాము సంఘీభావం తెలియజేస్తున్నామని ఆ ప్రతిజ్ఞాపత్రంలో పేర్కొన్నారు. ఈ ప్రతిజ్ఞాపత్రాన్ని ‘నెవర్ అగేన్ డాట్ టెక్’ అనే వెబ్ సైట్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ‘గూగుల్’ అధికారులు మాట్లాడుతూ, తమ సంస్థలో ముస్లిం ఉద్యోగులను గుర్తించేందుకు ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటు చేయాలని ఇంతవరకూ తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని, ఒకవేళ, అటువంటి ఆదేశాలు అందినా కూడా.. ఆ తరహా రిజిస్టర్ ను ఏర్పాటు చేయమని చెప్పారు.