: దేశభక్తి అనేది ఓ రాజకీయ పార్టీకి చెందిన అంశంగా ఉండకూడదు.. అసలు జాతీయ గీతం సినిమా థియేటర్లలోనే ఎందుకు?: పవన్ కల్యాణ్
భారతీయ జనతా పార్టీ ముందు ఇటీవలే ఐదు అంశాలను ఉంచిన జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ఇప్పటికి వాటిలో రెండు అంశాల గురించి ప్రశ్నించిన విషయం తెలిసిందే. మొన్న గోవధ, నిన్న రోహిత్ వేముల ఆత్మహత్య గురించి బీజేపీని నిలదీసిన పవన్.. నేడు మూడో అంశమైన దేశభక్తిపై స్పందించారు. కుల, మత, వర్గ, ప్రాంత, భాషా భేదాలు లేకుండా దేశంలోని పౌరుడు, రాజకీయ పార్టీలు ముందుకు వెళ్లడమే దేశభక్తి అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశభక్తి అనేది ఓ రాజకీయ పార్టీకి చెందిన అంశంగా ఉండకూడదని అన్నారు. దేశభక్తి అనేది మనిషిలో విలువలతో, మానవతతో కూడి ఉండే అంశమని అన్నారు.
మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో అధికార పార్టీ విధానాలను ఎవరయినా విభేదిస్తే అది యాంటీ-నేషనల్ కాదని పవన్ అన్నారు. తమకు వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న వారి మాటలను అధికార పార్టీ మొదట వినాలని, ఆ తరువాతే చర్యలు తీసుకోవాలని అన్నారు. కొన్ని నెలల క్రితం ఢిల్లీలోని జేఎన్‌యూ స్టూడెంట్లను యాంటీ నేషనల్ గా చిత్రీకరించారని, ఆ తరువాత వారు ఆ చర్యకు పాల్పడలేదని రుజువయిందని పవన్ పేర్కొన్నారు.
రాజకీయ పార్టీలు తమ పార్టీ మీటింగ్‌లను జాతీయగీతంతో ఎందుకు ప్రారంభించవని, దేశంలోని ఉన్నత కార్యాలయాల్లో జాతీయ గీతాన్ని ఎందుకు ఆలపించడం లేదని పవన్ ప్రశ్నించారు. చట్టాలను అమలు చేయాలని ప్రబోధించే వారు మొదట తాము మార్గదర్శకంగా ఉండి ఇతరులు అనుసరించేలా చేయవచ్చు కదా? అని పవన్ పేర్కొన్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి సినిమా చూస్తూ గడపాల్సిన సాయంకాలాన్ని 'దేశభక్తి' ని నిరూపించుకునే పరీక్షకు వేదికగా మార్చడమేంటని, సినిమా థియేటర్‌లలోనే జాతీయగీతాన్ని పాడాలని ఎందుకు చెబుతున్నారని పవన్ ప్రశ్నించారు.