: మిస్టర్ హరీశ్ రావ్... మీకు బొంద పెట్టే సమయం వచ్చింది: డీకే అరుణ
తెలంగాణ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ నిప్పులు చెరిగారు. అధికారం ఉందన్న దురహంకారంతో విపక్షాలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో వాయిదా తీర్మానాలను ఇవ్వడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని... వాయిదా తీర్మానాలు ఇస్తే సస్పెండ్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాలపై చర్చిద్దామని చెబితే సరిపోయేదని... కానీ, సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే విపక్ష సభ్యులను సస్పెండ్ చేశారని అన్నారు.
గతంలో తెలంగాణ పేరెత్తితేనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారంటూ హరీశ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, హరీర్ రావు నాలుకకు నరం లేదని... ఎన్ని అబద్ధాలైనా చెబుతారని విమర్శించారు. అబద్ధాలను చెప్పడంలో మేనమాన కేసీఆర్ కు, మేనల్లుడు హరీశ్ రావుకు తేడా ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రజలంతా గమనిస్తున్నారని... 2019లో జరిగే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. "మిస్టర్ హరీశ్ రావ్... టీఆర్ఎస్ నేతలకు బొంద పెట్టే సమయం ఆసన్నమైంది" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.