: ఈ నిర్ణయం విజయవంతమైతే, దేశం ఎన్నడూ లేని పురోగతిని సాధిస్తుంది: అరుణ్ జైట్లీ
కొత్తనోట్లు చలామణిలోకి రావడంతో, దేశం ఎన్నడూ లేని పురోగతిని సాధిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొన్న జైట్లీ మాట్లాడుతూ, నోట్ల రద్దు సాహసోపేత నిర్ణయమని, ఈ నిర్ణయం విజయవంతంగా అమలైతే దేశంలో ఒక కొత్త శకం ఆరంభమవుతుందని అన్నారు. పెద్దనోట్లను రద్దు చేసి ఆచరణలో తమ ప్రభుత్వం సత్తా చూపించామని , నోట్ల రద్దు వల్ల ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ, భవిష్యత్తులో మంచి ఫలితాలను ఆశించవచ్చని అన్నారు. ఆర్బీఐ ఇప్పటికే సరిపడా నోట్లను చలామణిలోకి తెచ్చేందుకు తీవ్రంగా చర్యలు చేపడుతోందని, పెద్దనోట్ల రద్దు అంశంపై విపక్షాలు తలాతోకలేని ఆరోపణలు చేస్తున్నాయని జైట్లీ మండిపడ్డారు.