: ఆనాడు జై తెలంగాణ అన్నందుకు మమ్మల్ని సస్పెండ్ చేశారు, బయటకు ఈడ్చి పాడేశారు!: హరీశ్ రావు
తెలంగాణ శాసనసభ రెండో రోజు సమావేశాల్లో గందరగోళం నెలకొంది. తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సస్పెండ్ చేసిన అంశంపై సీఎల్పీ నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినందుకు గానూ మంత్రి హరీశ్‌రావు ఆయనకు కౌంటర్ ఇచ్చారు. ‘జానారెడ్డి కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడం దారుణం అంటూ మాట్లాడుతున్నారు.. మేము గతంలో ఇదే సభలో జై తెలంగాణ అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తెలంగాణ పదాన్ని కూడా సభలో నిషేధించారు.. మమ్మల్ని బయటకు ఈడ్చి పాడేశారు. తెలంగాణకు నష్టం కలిగించే ప్రాజెక్టులపై మాట్లాడినప్పుడు మమ్మల్ని బయటకు పంపేస్తే ఆనాడు మంత్రిగా ఉన్న జానారెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేస్తే అన్యాయం అంటున్నారు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.
గతంలో ఇదే సభలో ఎంత మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారో అందరికీ తెలుసని హరీశ్‌రావు అన్నారు. ఏదో ఒక్క రాద్ధాంతం చేసి సభను అడ్డుకుంటామంటే అది కుదరదని అన్నారు. ప్రజల సమస్యలపై చర్చించడానికి తాము సిద్ధమని పేర్కొన్నారు. సభలో ఏ అంశంపై అయినా చర్చించడానికి తాము సిద్దమేనని అన్నారు. అందరూ చర్చ జరగాలని కోరుకుంటుంటే కాంగ్రెస్ సభ్యులు రచ్చ జరగాలని కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని కాంగ్రెస్ నేతలు వృథా చేస్తున్నారని ఆయన అన్నారు.