: ఆంధ్ర యూనివర్శిటీ అ'పూర్వ' సమ్మేళనం నేడే
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పూర్వ విద్యార్థుల సమ్మేళనం తుది వేడుకలకు యూనివర్శిటీ సిద్ధమైంది. ఈ నెల 10న ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. పూర్వ విద్యార్థుల వార్షిక సమ్మేళన వేడుకలు, యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ ఆచార్య కట్టమంచి రామలింగారెడ్డి జయంతి వారోత్సవాలను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు.
ఈ సాయంత్రం ఏయూ స్నాతకోత్సవ మందిరంలో పూర్వ విద్యార్థుల సమావేశం, ముగింపు వేడుకలు జరగనున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్ బాబు, అమెరికన్ బ్యాంకు ఛైర్మన్ పూర్ణ సగ్గుర్తి, పలువురు రాజకీయ నాయకులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు గ్రంధి మల్లికార్జునరావు హాజరుకానున్నారు. వారితో పాటు దేశవిదేశాల నుంచి దాదాపు 4వేల మంది పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ముగింపు వేడుకల్లో... పూర్వ విద్యార్థుల సంఘం లోగో, ప్రత్యేక వీడియో పాట, సావనీర్ లతో పాటు పూర్వ విద్యార్థుల సంఘం అభివృద్ధి చేసిన భవనాలను చంద్రబాబు ప్రారంభిస్తారు. ఈ ఉదయం నుంచి పూర్వ విద్యార్థులంతా తాము చదివిన విభాగాల్లో తమ స్నేహితులు, ఆచార్యులతో సమావేశమవుతారు. సాయంత్రానికి బహిరంగ సభకు వచ్చేస్తారు. ముగింపు వేడుకల కోసం ఏయూ సుందరంగా ముస్తాబయింది. స్నాతకోత్సవ భవనం, పరిసర ప్రాంతాలు విద్యుద్దీపాలంకరణలతో ఆకర్షణీయంగా తయారయ్యాయి.