: కూకట్‌పల్లిలో ఇళ్ల మధ్య భారీ డ్రగ్ రాకెట్.. పట్టుకున్న పోలీసులు.. రూ.కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
గుట్టుచప్పుడు కాకుండా ఇళ్ల మధ్య భారీ ఎత్తున డ్రగ్స్ వ్యాపారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును నార్కోటిక్స్ అధికారులు రట్టు చేశారు. కూకట్‌పల్లిలోని మైత్రీనగర్‌లో డ్రగ్స్ వ్యాపారం జోరుగా సాగుతోందన్న సమాచారంతో డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ అమృతరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. కోట్లాది రూపాయల విలువైన మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అపార్ట్‌మెంట్‌లో ఆఫీసు పేరుతో ప్లాట్ తీసుకుని సాయి ల్యాబ్ పేరుతో ఈ దందా నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. డ్రమ్ముల్లో నిల్వచేసిన 50 కిలోల మత్తు పదార్థాలను, కాంటాను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఇక్కడి నుంచి బీదర్‌కు తరలిస్తున్నట్టు తేలింది. నిందితుడు గడ్డం కిషోర్‌రెడ్డి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.