: ‘మెట్రో’లో సీటు కోసం గొడవ.. గొడ్డలితో దాడికి యత్నించిన మహిళ
ఢిల్లీ మెట్రో రైలులో తనకు సీటు ఇవ్వలేదంటూ తోటి ప్రయాణికురాలిపై ఒక మహిళ గొడ్డలితో దాడికి యత్నించింది. మిగిలిన ప్రయాణికులు ఆ మహిళను అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని హాజ్ ఖాస్ మెట్రో రైల్వేస్టేషన్ కు దత్త అనే అరవై ఐదు సంవత్సరాల మహిళ వెళ్లింది. తనిఖీలలో భాగంగా ఆమె సంచిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది పరిశీలించి చూడగా, అందులో చిన్న గొడ్డలి ఒకటి ఉంది. ఈ విషయమై సదరు మహిళను ప్రశ్నించగా, తాను కార్మికురాలినని, చిన్నచిన్న పనుల నిమిత్తం దీనిని ఉపయోగించుకుంటానని చెప్పింది.
దాంతో ఆ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోని సిబ్బంది ఆమెను వదిలివేయడంతో, లేడీస్ కంపార్టుమెంట్ లోకి ఎక్కింది. తర్వాత సీటు కోసం తోటి ప్రయాణికురాలితో గొడవ పడింది. ఈ క్రమంలో తన సంచిలోని గొడ్డలిని బయటకు తీసి దాడికి యత్నించింది. అయితే, తోటి ప్రయాణికులు ఆమెను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. దాడికి యత్నించిన దత్తకు కౌన్సెలింగ్ ఇచ్చి పోలీసులు వదిలిపెట్టారు. అయితే, ఆమెను గొడ్డలితో స్టేషన్ లోకి అనుమతించిన భద్రతా సిబ్బందిపై మాత్రం వేటు పడింది. సదరు భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు, ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు.