: రాజన్న రాజ్యం వచ్చే వరకు విశ్రమించం!: కాసు మహేశ్ రెడ్డి
రాజన్న రాజ్యం మళ్లీ వచ్చే వరకు విశ్రమించమని వైఎస్సార్సీపీలో కొత్తగా చేరిన కాసు మహేశ్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరుగుతున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ పార్టీలో తాను చేరింది ప్రజల రుణం తీర్చుకోవడానికేనని, పల్నాడు ప్రజల ప్రేమను, అభిమానాన్ని మరచిపోలేనని అన్నారు. 2014 ఎన్నికల్లో జరిగిన పొరపాటు 2019 ఎన్నికలలో జరగకూడదని, వచ్చే ఎన్నికల్లో జగన్ ని ముఖ్యమంత్రిని చేసి.. ఏపీకి పట్టిన శనిని వదిలిద్దామని అన్నారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా చిరునవ్వుతో సమాధానం చెబుదామని, ఆట మొదలైందని.. రెండేళ్లు రెండు ఘడియల్లో పూర్తి చేద్దామని, చేయి చేయి కలిపి ముందుకు సాగుదామని అన్నారు. ‘ఇక్కడ నినాదాలు చేస్తే.. అమరావతిలో వినపడాలి’ అంటూ బహిరంగ సభకు హాజరైన పార్టీ కార్యకర్తలను, అభిమానులను మహేశ్ రెడ్డి ప్రోత్సహించారు.