: వెనిజులాలో ఏటీఎంల నుంచి రద్దయిన నోట్లే వస్తున్నాయట!
వెనిజులాలో వంద బొలివర్ నోట్లను ఇటీవల రద్దు చేశారు. అప్పటి నుంచి అక్కడి ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. డిసెంబర్ 15వ తేదీ నుంచి మూడు రోజుల్లోగా వంద బొలివర్ నోట్లను కొత్త కరెన్సీతో మార్చుకోవాలని ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మడురో ప్రకటించారు. అయితే, కొత్త కరెన్సీ అధిక బ్యాంకులకు చేరుకోలేదు. దీంతో, పాత నోట్లు చెల్లక, కొత్త నోట్లు చేతికి అందక పేదలు, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు.
కొన్ని ఏటీఎంలలో అయితే, రద్దయిన నోట్లే వస్తున్నాయని కొంతమంది ఆరోపిస్తున్నారు. వ్యాపారలావాదేవీలు స్తంభించిపోవడంతో చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గురువారం నాటికి దేశంలోని అన్ని బ్యాంకులకు 500 నుంచి 20,000 బొలివర్ నోట్లు ఆరు డినామినేషన్లలో చేరుకుంటాయని, అప్పటి నుంచి 72 గంటల్లోగా పాతనోట్లు మార్చుకోవాలని దేశాధ్యక్షుడు నికోలస్ మడురో ప్రకటించారు. కొత్త కరెన్సీ ఆయా బ్యాంకులకు రాకపోవడంతో నిన్న రాత్రి నుంచే బ్యాంకుల ముందు బారులు తీరిన ప్రజలు నిరాశ చెందారు.