: కెరీర్ కు పునాది వేసుకోవాల్సిన అవసరం మీ అందరిపైనా ఉంది!: 'జాబ్ మేళా'లో నారా లోకేశ్
యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఎన్టీఆర్ ట్రస్టు, వికాస ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మెగా జాబ్ మేళా’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగులను ఉద్దేశించి లోకేశ్ మాట్లాడుతూ, ‘మీరు గ్రాడ్యుయేట్లు అయిన తర్వాత తప్పనిసరిగా ఏదో ఒక కంపెనీలో చేరాల్సిన అవసరం ఉంది. టీసీఎస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ .. వీటిలో దేనికో దానికి వెళ్లాలనే ఆలోచన ఉండటంలో తప్పులేదు. కానీ, ప్రయత్నం మొదలు పెట్టాలి. కెరీర్ కు పునాది వేసుకోవాల్సిన అవసరం మీ అందరిపైనా ఉంది. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మీ వల్ల జరుగుతుంది తప్పా, వేరే వారి వల్ల కాదు’ అని లోకేశ్ అన్నారు. రేపటి వరకు కొనసాగే ఈ జాబ్ మేళాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు తరలివచ్చారు. పలు ప్రముఖ సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి.