: అత్యధిక వలసదారుల సంతతి కలిగిన దేశాల్లో భారత్‌ నెం.1.. ఆశ్ర‌యం ఇచ్చిన దేశంలో అమెరికా నెం.1


స్వ‌దేశం నుంచి విదేశాల‌కు వెళ్లిన వారిలో అత్య‌ధికంగా భార‌తీయులే ఉన్నార‌ని ప్యూ రీసెర్చ్‌ కేంద్రం ప్ర‌క‌టించింది. దీంతో అత్యధిక వలసదారుల సంతతి కలిగిన దేశాలన్నింటి కన్నా మ‌న‌దేశమే మొదటి స్థానంలో నిలిచింది. ఇతర దేశాల్లో నివ‌సిస్తోన్న భార‌తీయుల సంఖ్య‌ కోటి 56 లక్ష‌లుగా ఉంద‌ని ప్యూ రీసెర్చ్ కేంద్ర‌ పేర్కొంది. ప్ర‌పంచంలోని అన్ని దేశాల నుంచి వ‌ల‌స‌లు వెళ్లిన వారి సంఖ్య ప్రపంచ జనాభాలో 3.3 శాతంగా ఉంద‌ని తెలిపింది. 2015లో యూఏఈలో నివ‌సిస్తోన్న భార‌తీయుల సంఖ్య‌ 35 లక్షలుగా పేర్కొంది. ఆ దేశంతో పాటు ఇతర గల్ఫ్‌ దేశాలకు కూడా మ‌న‌దేశం నుంచి ప్ర‌జ‌లు అత్య‌ధిక సంఖ్య‌లో వ‌ల‌స‌లు వెళ్లారని చెప్పింది.

గల్ఫ్‌ దేశాల్లో భార‌తీయుల సంఖ్య గ‌త ఏడాది 80 లక్షల మందికి పైగా ఉన్న‌ట్లు పేర్కొంది. ఈ సంఖ్య‌ 1990లో 20 లక్ష‌లుగా తెలిపింది. భార‌త్ త‌రువాత అత్యధిక వలసదారుల సంతతి కలిగిన దేశంగా మెక్సికో నిలిచింది. ఆ దేశం నుంచి ఇతర దేశాల‌కు కోటి 23 లక్షల మంది వ‌ల‌స‌లు వెళ్లారు. ఇక ఆ త‌రువాతి స్థానాల్లో  కోటి 6 లక్షల మందితో రష్యా,  95 లక్షల మందితో చైనా, 72 లక్ష‌ల మందితో బంగ్లాదేశ్‌ ఉన్నాయి. ఆయా దేశాల నుంచి అత్యధికంగా అమెరికాకే వ‌ల‌స‌లు వెళ్లారు. మొత్తం 4 కోట్ల 66 లక్షల మంది వలసదారులతో అత్య‌ధికంగా వ‌ల‌స‌దారుల‌కు ఆశ్ర‌యం ఇచ్చిన దేశంలో అమెరికా నిలిచింది. ఇక ఇదే అంశంలో రెండో స్థానంలో ఆ తర్వాత కోటి 20 లక్షల మందితో జర్మనీ,  కోటి 16 లక్షల మందితో రష్యా,  కోటి 2 లక్షల మందితో సౌదీ అరేబియా, 85 ల‌క్ష‌ల మందితో  బ్రిటన్  దేశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News