: ఆలోచించే తీసుకున్నారో.. అనాలోచితంగానో తీసుకున్నారో, ఇక వాటి గురించి మాట్లాడొద్దు: పెద్దనోట్ల రద్దుపై సీఎం కేసీఆర్
పెద్దనోట్ల రద్దుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటన చేసిన తరువాత కాంగ్రెస్ నేత జానారెడ్డి అదే అంశంపై మాట్లాడారు. అనాలోచితంగా, ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని అన్నారు. ఎంతో మంది ప్రజలు రోడ్డుపై పడ్డారని, కేంద్ర సర్కారు విఫలమైందని అన్నారు. ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఎదురైందని చెప్పారు. దీంతో, కల్పించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దయచేసి కేంద్రం పరిధిలో ఉన్న అంశాలను గురించి మాట్లాడకూడదని అన్నారు. కేంద్ర సర్కారు ఈ నిర్ణయాన్ని ఆలోచనతోనే తీసుకున్నారో, అనాలోచితంగా తీసుకున్నారో కానీ ఇక వాటి గురించి మాట్లాడొద్దని చెప్పారు. కేవలం రాష్ట్ర ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు, వాటిని నిరోధించడానికి తీసుకోవాల్సిన సూచనల గురించి మాత్రమే మాట్లాడాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఎంత నగదు రాష్ట్రానికి వచ్చిందో, ఏయే చర్యలు తీసుకున్నామో అడిగితే చెబుతామని, కేంద్ర ప్రభుత్వ పాలసీపై ఇక్కడ మాట్లాడితే లాభం లేదని పేర్కొన్నారు.