: బాబోయ్! ఈ పాలుగానీ తాగుతున్నారా, ఏంటి?.. హైదరాబాద్ విద్యార్థులు నిర్వహించిన అధ్యయనంలో విస్తుపోయే నిజాలు వెల్లడి
పాలు.. సంపూర్ణ ఆహారం. ఒక్క గ్లాసు పాలతో సంపూర్ణ ఆరోగ్యం.. ఇది వైద్యులు చెప్పే సూచన కాదు.. చిన్నప్పటి నుంచి చదువుకున్న పాఠాలు కూడా ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించాయి. అయితే హైదరాబాద్‌లోని మూసీ పరీవాహక ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్నపాలను తాగారో ఇక అంతే సంగతులు. ఆరోగ్యాన్ని రక్షించాల్సిన పాలు మిమ్మల్ని భక్షించేస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. హైదరాబాద్‌లోని వివేకవర్థిని, బీజేపీఆర్ కాలేజీ విద్యార్థులు గండిపేట నుంచి సూర్యాపేట వరకు ఉన్న మూసీ పరీవాహక ప్రాంతాల్లో నిర్వహించిన అధ్యయనంలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
ఈ అధ్యయనం విషయాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రెంట్ అడ్వాన్స్ రీసెర్చ్‌కు చెందిన సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మూసీ పరీవాహక ప్రాంతాల నుంచి వస్తున్న పాలలో రసాయనాలు మోతాదుకు మించి ఉంటున్నాయని, ఈ పాలల్లో లెడ్ ఆరు వందల రెట్లు అధికంగా ఉందని విద్యార్థులు గుర్తించారు. ఫలితంగా సంపూర్ణ ఆహారమైన పాలు సంపూర్ణ విషతుల్యంగా మారుతోందని విద్యార్థులు వివరించారు. మోతాదుకు మించి లెడ్ ఉండడం వల్ల వాటిని తాగిన వారు అనారోగ్యం పాలవడం ఖాయమని నివేదిక పేర్కొంది.
ఈ ప్రాంతంలో పేరుకుపోయిన కాలుష్యాన్ని ఇప్పటికైనా నివారించకపోతే భవిష్యత్తులో మరిన్ని అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశోధన నిర్వహించిన విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. కాగా హైదరాబాద్‌లో రోజుకు 20 లక్షల లీటర్ల పాలను ప్రతిరోజు వినియోగిస్తున్నారని, సగటున ఒక్కో వ్యక్తి వివిధ రూపాల్లో 500 మిల్లీ లీటర్ల పాలను తీసుకుంటున్నాడని వైద్యులు చెబుతున్నారు. మూసీ నది నీరు కాలుష్యాలతో విషతుల్యంగా మారడమే ఇందుకు కారణం. ఆ నీళ్లు తాగి, ఆ నీళ్లతో పెరిగిన గడ్డిని మేసిన పశువులు ఇచ్చే పాలల్లో విష పదార్థాలు ఉన్నట్టు విద్యార్థులు గుర్తించారు. మూడేళ్లపాటు అధ్యయనం నిర్వహించిన విద్యార్థులు మూసీ నీళ్లు, ఆ నీటితో పెరిగిన గడ్డి, ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే డైరీ ఫామ్‌ల నుంచి పాలను సేకరించి ఈ అధ్యయనం నిర్వహించారు.
240 కిలోమీటర్ల మేర విస్తరించిన మూసీ నదిలో 135 కిలోమీటర్ల మేర వివిధ రసాయనాలతో పూర్తిగా కాలుష్యంగా మారిందని అధ్యయనంలో తేలింది. పాలల్లో లెడ్ స్థాయి మోతాదుకు మించితే దీర్ఘకాలంలో పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. కేన్సర్, కాలేయ ఇన్ఫెక్షన్, ఎముకలు బలహీనంగా మారడం వంటి సమస్యలు వస్తాయని, ఆలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కాలుష్య నియంత్రణ బోర్డు కళ్లు తెరిచి మూసీ పరీవాహక ప్రాంతంలో పర్యవేక్షించాలని అవసరం ఉందని, అక్కడి నీళ్లను పశువులకు ఉపయోగించకుండా చూడాలని కోరుతున్నారు.