: పెద్దనోట్ల రద్దుతో తెలంగాణకు లబ్ధి.. ఆ ప్రభావం రాష్ట్రంపై లేదు.. ఆదాయమూ ఓకే: కేసీఆర్
పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణకు లబ్ధి చేకూరిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఊహించినంత నష్టమేమీ రాష్ట్రానికి జరగలేదని తెలిపారు. ఆదాయం కూడా బాగానే ఉందని పేర్కొన్నారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దు ప్రభావం రాష్ట్రంపై లేదన్నారు. రియల్ ఎస్టేట్ రంగం నుంచి ఆదాయం పడిపోతుందని భావించామన్నారు. అయితే మూడొంతుల ఆదాయం తగ్గుతుందనుకుంటే ఒక వంతు మాత్రమే తగ్గిందని వెల్లడించారు. మరోవైపు ఎక్సైజ్ ఆదాయం మాత్రం పెరిగిందని తెలిపారు. పెట్రోలు, డీజిల్ అమ్మకాలు, ఆర్టీసీ ద్వారా వచ్చే ఆదాయంలో ఎలాంటి మార్పు కనిపించలేదన్నారు. నోట్ల రద్దుతో ప్రయోజనం పొందిన రాష్ట్రాల్లో గుజరాత్ తర్వాత తెలంగాణనే ఉందన్నారు. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్లకు సీఎం సూచించారు.