: ప్రధానికి నేనిచ్చిన సలహాలు పాటిస్తే.. బంగారు భారతం తథ్యం: ముఖ్యమంత్రి కేసీఆర్
తానిచ్చిన సలహాలను ప్రధాని నరేంద్రమోదీ కనుక పాటిస్తే బంగారు భారతం ఖాయమని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రధానితో తాను మాట్లాడానని, కొన్ని సలహాలు, సూచనలు చేశానని తెలిపారు. వాటిని కనుక మోదీ అమల్లో పెడితే బంగారు భారతదేశం తథ్యమని అన్నారు. నోట్ల రద్దు తర్వాత ప్రధానితో మాట్లాడిన ముఖ్యమంత్రిని, నాయకుడిని తానేనని పేర్కొన్న కేసీఆర్ ఈ విషయంలో మరెవరూ ఆయనతో మాట్లాడలేదన్నారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రెండంచుల కత్తిలాంటిదని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్టు సమాచారం. ఈ పరిణామం ఎటుదారితీస్తుందో, ఎవరికి ప్రయోజం కలుగుతుందో ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. అయితే నోట్ల రద్దుతో తమకు లాభం కలుగుతుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. అందుకే ఇబ్బందులను సైతం మౌనంగా భరిస్తున్నారని సీఎం తెలిపారు. నోట్ల రద్దుపై ప్రధాని మరోమారు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. ఈనెల 31లోపు మోదీ ప్రజలకు ఎదో ఒకటి చెప్పాల్సిన అవసరం ఉందని, ఆయన ఏం చెబుతారో వేచి చూద్దామని అన్నారు.