: చెన్నయ్ లో నేటి నుంచి భారత్- ఇంగ్లండ్ చివరి టెస్టు మ్యాచ్!
ఇంగ్లండ్-భారత పర్యటనలో చివరిదైన ఐదో టెస్టు నేడు ప్రారంభం కానుంది. నేటి ఉదయం 9:30 గంటలకు చెన్నయ్ లోని చెపాక్ స్టేడియంలో మ్యాచ్ మొదలవుతుంది. ఇప్పటికే మూడు విజయాలు సాధించిన టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుని మంచి జోరుమీదుండగా, ఈ టెస్టును గెలుచుకుని పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు జట్లు విజయమే లక్ష్యంగా బరిలో దిగుతున్నాయి.
ఈ టెస్టును కూడా గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాలని కోహ్లీ సేన పట్టుదలగా ఉండగా, సిరీస్ ఫలితం తేలిపోవడంతో తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, దీంతో నేటి మ్యాచ్ లో స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉందని ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ తెలిపాడు. కొన్ని విభాగాల్లో టీమిండియా బలంగా ఉండడంతో సిరీస్ కోల్పోయామని, ఈ మ్యాచ్ లో సరికొత్త గేమ్ ప్లాన్ తో బరిలో దిగుతామని, టెస్టు గెలుచుకుంటామని కుక్ ఆశాభావం వ్యక్తం చేశాడు.