: పర్యటనలో లోకేశ్.. చేతివాటంలో దొంగలు బిజీ బిజీ!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ గుంటూరు జిల్లా యడ్లపాడు పర్యటనలో బిజీగా ఉంటే జేబు దొంగలు తమ చేతివాటం చూపడంలో బిజీగా మారిపోయారు. మండలంలోని తిమ్మాపురంలో బుధవారం నాభిశిల ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. దీనికి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాతీయ రహదారి నుంచి నాభిశిల ప్రతిష్ఠ జరిగే ప్రదేశం వరకు ఉన్న దాదాపు 150 మీటర్ల దూరాన్ని చేరుకునేందుకు ఏకంగా గంట సమయం పట్టింది.
నాభిశిల ప్రతిష్ఠ, పూజల అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమయంలో లోకేశ్‌ను కలిసేందుకు నాయకులు, మహిళలు, కార్యకర్తలు పోటీపడడంతో స్వల్ప తోపులాట జరిగింది. దీనిని అవకాశంగా చేసుకున్న జేబు దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. కనిపించిన వారి జేబులు కనిపించినట్టు కత్తిరించేశారు. లోకేశ్ పర్యటన ముగిసి ఇంటికి చేరుకున్నాక కానీ తమ జేబులు గుల్లయ్యాయన్న సంగతిని గుర్తించలేకపోయారు.
తిమ్మాపురానికి చెందిన ధనేకుల కృష్ణమోహన్ నుంచి రూ.40 వేలు, నాగండ్ల శేషు నుంచి రూ.26 వేలు, ఏటీఎం కార్డు ఉన్న పర్సు, సర్పంచ్ ఎలికా రాఘవుల వద్ద ఉన్న రూ.5 వేలు, లెనిన్ నుంచి రూ.50 వేల విలువైన బంగారం బ్రేస్‌లెట్‌ను జేబుదొంగలు మాయం చేశారు. అలాగే యడ్లపాడు గ్రామానికి చెందిన గొరిజవోలు రవీంద్రబాబు వద్ద ఉన్న రూ.10 వేలు, చిలకలూరిపేటకు చెందిన పి.భక్తవత్సలరావు వద్ద నుంచి రూ.12 వేలు, బోయపాలేనికి చెందిన వడ్డేపల్లి దుర్గా ప్రసాద్ వద్ద ఉన్న రూ.1600 నగదు, ఏటీఎం కార్డు చోరీకి గురయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మరెందరో బాధితులు ఉన్నారు. అయితే ఈ చోరీలపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామని ఎస్సై రమేశ్‌బాబు తెలిపారు.