: అవసరం మేర రెండు వేల నోట్లు ఉన్నాయి.. 2ల‌క్ష‌ల ఏటీఎంల‌ను ఇప్ప‌టికే రీ క్యాలిబ‌రేట్ చేశాం: శ‌క్తికాంత‌దాస్


పెద్ద‌నోట్ల ర‌ద్దు అనంత‌రం కేంద్ర ప్ర‌భుత్వం, భారతీయ రిజ‌ర్వు బ్యాంకు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై కేంద్ర ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి శ‌క్తికాంత‌దాస్ ఈ రోజు ఢిల్లీలో మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... కొత్త నోట్ల స‌ర‌ఫ‌రా రోజురోజుకీ మెరుగ‌వుతోందని చెప్పారు. కొత్త‌నోట్లు పూర్తి సుర‌క్షిత‌మైన‌వని, కొత్త‌నోట్ల డిజైన్‌ను దేశీయంగా రూపొందించామ‌ని, ఎన్నో క‌ట్టుదిట్ట‌మైన సెక్యూరిటీ ఫీచ‌ర్ల‌తో వీటిని రూపొందించామ‌ని అన్నారు. వీటికి న‌కిలీ నోట్ల‌ను ముద్రించ‌డం క‌ష్టతరమని చెప్పారు. ప్ర‌స్తుతం 500 నోట్ల ముద్ర‌ణ‌పైనే ఎక్కువ‌ దృష్టి పెట్టిన‌ట్లు చెప్పారు. మార్కెట్‌లో అవ‌స‌రం మేర‌ రెండు వేల నోట్లు ఉన్నాయని స్ప‌ష్టం చేశారు.

విమానాల ద్వారా  నోట్ల త‌ర‌లింపు ప్ర‌క్రియ కొన‌సాగుతూనే ఉంద‌ని, గ్రామీణ ప్రాంతాల‌కు కూడా పంపిణీ చేస్తున్నామ‌ని శ‌క్తికాంత‌దాస్ తెలిపారు. దేశంలో అధిక సంఖ్య‌లో ఏటీఎంల‌ను రీ క్యాలిబ‌రేష‌న్ చేశామ‌ని, కొన్ని ఏటీఎంలలో ఆ ప‌ని ఇంకా జ‌ర‌గాల్సి ఉంద‌ని చెప్పారు. కొత్త నోట్లు రావ‌డానికి అనుగుణంగా వాటిలో నిపుణులు మార్పులు చేశార‌ని అన్నారు. దేశంలో ప్ర‌స్తుతం మొత్తం 2,20,000 ఏటీఎంలు ఉన్నాయ‌ని, వాటిలో 2 ల‌క్ష‌ల ఏటీఎంల‌ను ఇప్ప‌టికే రీ క్యాలిబ‌రేట్ చేశామ‌ని అన్నారు. అక్ర‌మ లావాదేవీల‌పై అధికారుల నిఘా కొన‌సాగుతోంద‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News