: విమానాల్లో ఇకపై కేబిన్ బ్యాగేజ్ పై ‘నో’ స్టాంపింగ్ !
దేశీయ విమాన ప్రయాణికుల కేబిన్ బ్యాగేజ్ కు స్టాంపింగ్ వేసే విధానానికి త్వరలో స్వస్తి చెప్పనున్నారు. దేశంలోని ఏడు ప్రధాన విమానాశ్రయాలు అయిన ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ లో తొలుత ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సీఐఎస్ఎఫ్ డీజీ ఓపీ సింగ్ తెలిపారు. విమాన ప్రయాణికులతో పాటు కేబిన్ లోకి అనుమతించే బ్యాగేజ్ పై ఆయా విమానయాన సంస్థలకు చెందిన ట్యాగ్ ను హ్యాండ్ లగేజ్ కు వేసేవారు. అనంతరం, సీఐఎస్ఎఫ్ చెకింగ్ చేసి దానిపై ఒక స్టాంప్ వేయడం పరిపాటి. అయితే, కొన్నిసార్లు ఆ ట్యాగులు ఊడిపోవడమో, చిరిగిపోవడమో జరుగుతుండేది. దీంతో, విమానం ఎక్కే సమయంలో సంబంధిత సిబ్బంది నుంచి పలు రకాల ప్రశ్నలను ప్రయాణికులు ఎదుర్కోవాల్సి వస్తుండేది. 1992 నుంచి దేశీయ విమానప్రయాణాల్లో ఈ పద్ధతి అమలులో ఉంది.