: డబ్బు అందుకున్న మహిళకు వింత కష్టాలు... ముట్టుకుంటే చిరిగిపోతున్న రెండు వేల నోట్లు


పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు ఎప్పుడూ అనుభ‌వించ‌ని కొత్త కొత్త క‌ష్టాలు అనుభ‌విస్తున్నారు. త‌మ‌ బ్యాంకు అకౌంట్లో చాలినంత డ‌బ్బున్న‌ప్ప‌టికీ తీసుకోలేని ప‌రిస్థితి, బ్యాంకుల ముందుకు చేరుకుంటే బ్యాంకు సిబ్బందితో పాటు క్యూలో నిల‌బ‌డిన వారితో గొడ‌వ‌లు,  పోలీసుల లాఠీఛార్జీలు వంటి ఘ‌ట‌న‌లు నెల‌కొంటూనే ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో చిన్న నోట్లే కాదు కొత్త‌గా తీసుకొచ్చిన రూ.2000 నోటు కూడా పొంద‌డం క‌ష్టంగా మారింది. అన్ని క‌ష్టాలు ఎదుర్కొని చివ‌రికి ఏడు కొండ‌ల వాడిని చూసినట్లు ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొని బ్యాంకు నుంచి ప్ర‌జ‌లు డ‌బ్బు అందుకుంటున్నారు. అయితే కేర‌ళ‌లో డ‌బ్బు అందుకున్న ఓ మ‌హిళ‌కు డ‌బ్బు అందుకున్న త‌రువాత కూడా వింత క‌ష్టాలు ఎదుర‌య్యాయి. బ్యాంకు నుంచి ప‌దివేల విలువ చేసే రెండు వేల కరెన్సీ నోట్లను పొందిన స‌ద‌రు మ‌హిళ‌ ఓ నోటు డ్రా చేసిన కొద్ది సమయానికే ముట్టుకుంటే చిరిగిపోవడం ప్రారంభించింది.

తాళిపరంబ టౌన్‌లోని ఫెడరల్‌ బ్యాంకు బ్రాంచ్‌ నుంచి రెండు వేల నోట్లు తీసుకున్న‌ పీసీ షరీఫా అనే మహిళకు ఈ అనుభ‌వం ఎదుర‌యింది. తీసుకున్న నోట్ల‌లోని సీరియల్‌ నంబర్‌ 456828 ఉన్న రెండు వేల నోటు ముట్టుకుంటేనే చివర్లలో చిరిగిపోవడం ప్రారంభించింది. ఈ విష‌యంపై స‌ద‌రు మ‌హిళ‌ కుమారుడు షిమీల్ మీడియాకు తెలుపుతూ, ఒక‌నోటు చినిగిపోగా మిగిలిన నాలుగు నోట్లు కూడా అలాగే చిరిగిపోతుండటం గమనించి వాటిని వెంట‌నే ఖర్చులకు వాడేశానని చెప్పాడు. త‌న వ‌ద్ద ఉన్న‌ బాగా చిరిగిన నోటును ఎవరూ తీసుకోవడం లేదని చెప్పాడు. చివ‌ర‌కు ఈ నోటుని తీసుకొని బ్యాంకుకు వెళ్లి తిరిగి ఇచ్చేస్తానంటే బ్యాంకు వారు కూడా నోటును తీసుకోలేద‌ని తెలిపాడు.  

  • Loading...

More Telugu News