: రూ.18 వేల విలువైన సామ్‌సంగ్ జే7 ఫోన్ కేవలం.. రూ.4 వేలే.. అద్భుత ఆఫర్ అంటూ మోసం


మోసపోయే వారు ఉండాలే కానీ మోసం చేసేవారికి కొదవ లేదని నిరూపించే ఘటన ఇది. మీ మొబైల్ నంబరుకు అద్భుత ఆఫర్ ఉందని, రూ.18 వేల విలువైన సామ్‌సంగ్ జే7 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.4 వేలకే ఇస్తున్నట్టు తీయటి గొంతుతో ఓ అమ్మాయి పలకరింపు. ఆఫర్ వద్దనుకుంటే ప్రపంచంలో మీ అంతటి మూర్ఖుడు మరొకడు ఉండడంటూ దెప్పిపొడుపు. పార్శిల్ అందినాకే డబ్బు ఇవ్వాలని, విషయం ఎవరికీ చెప్పవద్దని, ఈ అవకాశం మీకు మాత్రమేనంటూ ఫోన్‌లో ఉపన్యాసం.. వెరసి ఓకే అన్నవారికి టోపీ. ఇలా కేటుగాళ్ల వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్న వారి సంఖ్య హైదరాబాద్‌‌లో రోజురోజుకు ఎక్కువవుతోంది. మూడు రోజుల్లేనే ఏకంగా పదిమంది బాధితులు సైబర్ క్రైమ్ స్టేషన్‌ను ఆశ్రయించడం చూస్తుంటే మోసం ఏ రేంజ్‌లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

 హైదరాబాద్ శివారులోని మహేశ్వరానికి చెందిన నరేందర్ ఇలానే మోసపోయాడు. ఓ యువతి తియ్యగా పలకరిస్తూ ఆఫర్ చెప్పగానే వెనకా ముందు ఆలోచించకుండా ఓకే అన్నాడు. వికారాబాద్‌కు చెందిన దినసరి కూలీ అయిన కృష్ణ కూడా ఇలానే మోసపోయాడు. ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, జవహర్‌నగర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో నివసిస్తున్న వలస వచ్చిన వారిని టార్గెట్ చేస్తూ కేటుగాళ్లు తమ ‘వ్యాపారాన్ని’ మూడుపువ్వులు, ఆరు కాయలుగా విజయవంతంగా నడిపిస్తున్నారు. మోసపోయిన వారిలో 80 శాతం మంది గ్రామీణులేనని పోలీసులు చెబుతున్నారు. డబ్బు కట్టాక అందుకున్న పార్శిళ్లలో  తాబేలు బొమ్మలు, దండలు ఉండడంతో ‘బుక్’ చేసుకున్నవారు లబోదిబోమంటున్నారు.

మోసపోయిన బాధితులు వచ్చిన నంబరుకు ఫోన్ చేస్తే అప్పటి వరకు ఆప్యాయంగా మాట్లాడిన వారు ఎదురు తిరుగుతున్నారు. బూతులు తిడుతూ అంతుచూస్తామని బెదిరిస్తున్నట్టు బాధితులు వాపోతున్నారు. అసభ్యకరంగా మాట్లాడుతూ తమను ఎవరూ ఏమీ చేయలేరని, దిక్కున్న చోట చెప్పుకోవాలని బెదిరిస్తున్నారని చెబుతున్నారు. తెలుగులో చక్కగా మాట్లాడే మోసగాళ్లు తాము ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పడం గమనార్హం. గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వస్తే అప్రమత్తంగా ఉండాలని, స్పందించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. మోసపోయిన వారు తమను సంప్రదించాలని కోరారు.

  • Loading...

More Telugu News