: 'కోహ్లీకి నాకంటే దూకుడెక్కువ' అంటూ కితాబునిచ్చిన గంగూలీ
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి తనకంటే దూకుడెక్కువని దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ కాంప్లిమెంట్ ఇచ్చాడు. కోల్ కతాలోని గంగూలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'గంగూలీ క్రికెట్ స్కూల్'ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఇష్టమైన కెప్టెన్లలో కోహ్లీ ఒకడని అన్నాడు. కోహ్లీ ప్రత్యర్థులకు ఒక్క అంగుళం కూడా అవకాశం ఇవ్వడం లేదని కితాబునిచ్చాడు. తనకంటే రెండు రెట్ల దూకుడుతో కోహ్లీ ఆడుతున్నాడని తెలిపాడు. తన స్కూల్ లో పిచ్ విజన్ టెక్నాలజీతో క్రికెట్ నేర్పిస్తున్నామని, ఇది వర్థమాన ఆటగాళ్లకు మేలు చేస్తుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. అత్యుత్తమ శిక్షణతో ఆటగాళ్లు టెక్నిక్ మెరుగుపరుచుకుంటారని గంగూలీ తెలిపాడు. కాగా, భారత క్రికెటర్లు, కెప్టెన్లలో దూకుడైన వ్యక్తిగా గంగూలీ పేరుతెచ్చుకున్న సంగతి తెలిసిందే.