: దేశ వ్యాప్తంగా ‘మాంజా’పై నిషేధం: గ్రీన్ ట్రైబ్యునల్
గాలిపటాలు ఎగురవేసేందుకు ఉపయోగించే ‘మాంజా’పై దేశ వ్యాప్తంగా నిషేధం విధించారు. ‘మాంజా’పై పూసే గాజు, లోహాల పొడి పూత మనుషులకు, జంతువులకు, పర్యావరణానికి చాలా హాని చేస్తుందని గ్రీన్ ట్రైబ్యునల్ పేర్కొంది. ట్రైబ్యునల్ చైర్మన్ స్వతంత్రకుమార్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
మాంజా దుష్ప్రభావాలపై జాతీయ కాలుష్య నియంత్రణ మండలికి ఒక నివేదిక అందజేయాలని భారత మాంజా సంఘాన్ని ఈ సందర్భంగా గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది. కాగా, సంక్రాంతి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో గాలిపటాలు ఎగురవేసే నిమిత్తం మాంజాను ఎక్కువగా వినియోగిస్తారు. దుష్ప్రభావాలను కలగజేసే ‘మాంజా’ను నిషేధించాలని కోరుతూ న్యాయవాదులు సంజయ్ హెగ్డే, షాదన్ ఫరాసత్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రైబ్యునల్ ఈ ఆదేశాలు జారీ చేసింది.