: ఎదుటివారిని కుంగిపోయేలా చేస్తాను: రాఖీ సావంత్
‘నేను కుంగిపోవడమా! ఎదుటివారిని కుంగిపోయేలా చేస్తాను’ అని బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే రాఖీ సావంత్ ప్రస్తుతం ‘రాఖీ ఇన్ ఖాకీ’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ సందర్భంగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావించింది. ఆమె కొలంబోలో ఒక షోలో నటిస్తున్న సమయంలో ప్రమాదం సంభవించడంతో తలకు గాయమైందట. స్టేజ్ పై అలముకున్న కృత్రిమ పొగ కారణంగా ఏదో వస్తువు తగిలి కిందపడటంతో ఆమె తలకు గాయమైంది. ఆ గాయానికి ఆపరేషన్ చేయాల్సి రావడంతో తలపై జుట్టు తీసేశారు. దీంతో, తలపై జుట్టు లేకుండా బయటి ప్రపంచంలోకి రాలేకపోయిందట. అంతేకాకుండా, ఈ ప్రమాదం కారణంగా ఆమె తన జ్ఞాపక శక్తిని కూడా కోల్పోయిందట. అయితే, దేవుడి దయవల్ల కోలుకున్నానని, అందుకు రెండేళ్ల సమయం పట్టిందని, ప్రస్తుతం బాగానే ఉన్నానని రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది. అయితే, ఆ సమయంలో తనకు డిప్రెషన్ మాత్రం రాలేదని, అయినా తాను ఎదుటి వారికి డిప్రెషన్ తెప్పించే రకాన్నని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చింది.