: ‘గ్లోబల్ థింకర్’గా సుష్మా స్వరాజ్... ప్రధాని అభినందనలు
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు అరుదైన గౌరవం లభించింది. ప్రముఖ ‘ఫారిన్ పాలసీ’ పత్రిక ప్రకటించిన ‘గ్లోబల్ థింకర్’ జాబితాలో ఆమెకు స్థానం లభించింది. ‘గ్లోబల్ థింకర్’ జాబితా కింద మొత్తం 15 మందిని ఎంపిక చేశారు. ఈ జాబితాలో సుష్మా స్వరాజ్ తో పాటు అమెరికాలో డెమొక్రాటిక్ పార్టీ నేత హిల్లరీ క్లింటన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్, కెనడా కొత్త ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తదితరులు ఉన్నారు.
కాగా, సుష్మా స్వరాజ్ ‘గ్లోబల్ థింకర్’ గా ఎంపికైన విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆమెను అభినందిస్తూ ఒక పోస్ట్ చేశారు. చాలా గర్వంగా ఉందని, కష్టించి పనిచేసే ఒక మంత్రి గ్లోబల్ థింకర్స్ జాబితాలో చేరారని, ఆమెకు అభినందనలు అని మోదీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, తమ సమస్య ఇది అని ఒక ట్వీట్ చేస్తే చాలు, తక్షణం స్పందించే సుష్మా స్వరాజ్, ఆ సమస్యను పరిష్కరించే వరకు నిద్రపోరు. ఈ విధంగా ఆమె సాయం పొందిన వారు ఎందరో ఉన్నారు. ఇటీవలే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న ఆమె కోలుకుంటున్న విషయం విదితమే.