: సినిమా కోసమే పుట్టిన వ్యక్తి రాంగోపాల్ వర్మ: నటుడు ఉత్తేజ్
సినిమా కోసమే పుట్టిన వ్యక్తి రాంగోపాల్ వర్మ అని ప్రముఖ నటుడు ఉత్తేజ్ అన్నాడు. ఉత్తేజ్ తెలుగు చిత్ర రంగంలోకి అడుగుపెట్టి సిల్వర్ జూబ్లీ అయిన సందర్భంగా, ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటే తనకు ఎంతో గౌరవమని, మరో దర్శకుడు కృష్ణవంశీ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. సినిమా కోసమే ఈ భూమి మీదకు వచ్చిన వ్యక్తి వర్మ అని, సినిమాలు చేసుకుని వెళ్లిపోతాడని అన్నారు.
వర్మ గతంలో ఒకసారి సినిమాకు వెళ్లిన సంఘటనను ఈ సందర్భంగా ఉత్తేజ్ ప్రస్తావిస్తూ.. ‘సంగీత్ థియేటర్ లో ఇంగ్లీషు సినిమా చూసేందుకు వర్మ వెళ్లారు. అప్పట్లో, థియేటర్ బయట ఉండే బాక్స్ లో సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఉండేవి. ఆ బాక్స్ లో ఇంటర్ వెల్ వరకు, ఆ తర్వాత సెకండాఫ్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు వేర్వేరుగా ఉండేవి. ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేందుకు ఆ ఫొటోలను పెట్టేవారు. అదేవిధంగా, రాము గారు వెళ్లిన ఇంగ్లీషు సినిమాకు సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి.
ఇంటర్ వెల్ సమయంలో బయటకు వచ్చిన ఆయన ఆ ఫొటోలను చూసి ఇంటర్ వెల్ తర్వాత ఆ సినిమా అంత గొప్పగా ఉండదని భావించి, తన స్కూటర్ పై ఒక్కరే ఇంటికి వెళ్లిపోయారు. తీరా, ఇంటికి వెళ్లిన తర్వాత.. ఇంట్లో వాళ్లు ప్రశ్నించిన తర్వాత ఆయనకు అసలు విషయం గుర్తుకు వచ్చింది.. తన భార్యను థియేటర్లోనే వదిలేసి వచ్చానని. ఆ తర్వాత, రాము గారి భార్య ఆటోలో ఇంటికి వచ్చింది’ అని చెబుతూ ఉత్తేజ్ పగలబడి నవ్వాడు.