: ప్రధాని మోదీ వ్యక్తిగత అవినీతి సమాచారం నా దగ్గర ఉంది: రాహుల్ గాంధీ
పార్లమెంటులో సమస్యలపై చర్చించాలని తాము అనుకున్నామని... కానీ, ప్రభుత్వం చర్చలు జరపాలనే ఉద్దేశంలో లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఈ రోజు లోక్‌సభ వాయిదాపడిన అనంతరం పార్లమెంటు వెలుపల విపక్ష నేతలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కచేరీలకు, పబ్లిక్ మీటింగ్‌లకు వెళ్లడం కాదని, లోక్‌సభలో ప్రధానమంత్రి బాధ్యతగా దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఈ రోజు లోక్ సభలో తనకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని, ప్రధాని వ్యక్తిగత అవినీతి సమాచారం తన దగ్గర ఉందని, ఈ అంశంపై మాట్లాడాలనుకున్నానని రాహుల్ గాంధీ అన్నారు. సభలో మాట్లాడే హక్కు తనకు ఉందని, తాను మాట్లాడితే ప్రభుత్వ నేతలు ఇబ్బంది పడతారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలతో పార్లమెంటుకు ఎన్నికైన సభ్యుడినైన తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ఆయన మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమేనా? అని ప్రశ్నించారు.