: 30% కమీషన్ ఇవ్వండి.. ఎన్ని పాత నోట్లనయినా మార్చుకోండి: పట్టుబడిన ఆర్బీఐ అధికారి జరిపిన దందా
పెద్ద ఎత్తున అక్రమలావాదేవీలు జరుపుతున్న ఆర్‌బీఐకి చెందిన సీనియర్ స్పెషల్ అసిస్టెంట్ మైఖేల్ కట్టుకరన్‌ను ఇటీవలే సీబీఐ అధికారులు బెంగళూరులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.17 లక్షల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ అధికారులు జరుపుతున్న విచారణలో సదరు అవినీతి అధికారి పలు విషయాలను వెల్లడించారు. తన సాయంతో ఎంత డబ్బయినా మార్చుకోవచ్చని అయితే, తనకు మాత్రం నల్లకుబేరులు మార్చుకున్న డబ్బులో 30 శాతం కమీషన్ ఇవ్వాలని ఆయన బేరం పెట్టినట్లు తెలిసింది. సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న వారిలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూరు క్యాషియర్ పరాశివమూర్తి కూడా ఉన్నారు.
పరాశివమూర్తి మనీ లాండరింగ్‌కు సంబంధించిన 12 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. వీరిరువురూ కలిసి మొత్తం కోటిన్నర రూపాయల పాతనోట్లను తీసుకొని కొత్త నోట్లతో మారుస్తామని ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. రిజర్వు బ్యాంకు అధికారులు పెద్దనోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లను ఇచ్చేందుకు మైఖేల్‌ను కొల్లేగల్‌లోని కరెన్సీ చెస్ట్‌కు వెళ్లాలని సూచించారు. దీన్ని అదునుగా తీసుకున్న ఆయన పరాశివమూర్తితో పాటు మరి కొందరితో చేతులు కలిపాడని... మొత్తం 13 మంది నల్లకుబేరులతో ఒప్పందం చేసుకొని 30% కమీషన్ పద్ధతిలో డబ్బులు ఇస్తామని చెప్పారని ఆర్‌బీఐ అధికారులు మీడియాకు చెప్పారు.