: శాస్త్రోక్తంగా.. జయలలితకు మళ్లీ అంత్యక్రియలు
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు రెండోసారి అంత్యక్రియలను నిర్వహించారు. కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో పవిత్ర కావేరీ నది ఒడ్డున పశ్చిమవాహినిలో ఆమెకు మళ్లీ అంత్యక్రియలు నిర్వహించారు. చెన్నైలో జయ అంత్యక్రియలను హిందూ ఆచారాల ప్రకారం నిర్వహించలేదని... ఆమెను దహనం చేయకుండా, ఖననం చేశారని... దీంతో ఆమె ఆత్మకు మోక్షం లభించదని... అందుకే ఆమెకు మళ్లీ అంత్యక్రియలు నిర్వహించామని ప్రముఖ పూజారి రంగనాథ్ అయ్యంగార్ తెలిపారు. జయలలితకు వరసకు సోదరుడయ్యే వరదరాజు ఈ అంత్యక్రియలను దగ్గరుండి చేయించారు. జయలలిత రూపానికి ప్రతిరూపంగా ఉండేలా ఓ బొమ్మను చేయించి, దానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె ఆత్మకు శాంతి కలిగేందుకు మరో ఐదు రోజుల పాటు మరికొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.
తన సోదరి నాస్తికురాలు అయిఉంటే ఆమె దేవాలయాలకు వెళ్లేది కాదని, హిందూ ఉత్సవాల్లో పాల్గొనేది కాదని... ఆమె హిందూ ఆచారాలను గట్టిగా పాటిస్తారని... అందుకే ఆమెకు మళ్లీ అంత్యక్రియలను నిర్వహించామని వరదరాజు చెప్పారు. చెన్నైలో ఆమెను ఖననం చేసిన తీరుపట్ల మేలుకొటే, మైసూరుల్లో ఉండే ఆమె మేనల్లుళ్లు సైతం అసంతృప్తిని వ్యక్తం చేశారు. వీరు కూడా జయకు నిర్వహించిన తాజా అంత్యక్రియల్లో పాల్గొన్నారు.