: ‘నల్ల’ బ్యాంకులుగా పార్టీ కార్యాలయాలు.. నేతలే దళారులు.. స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిన వైనం
పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని కొందరు రాత్రికి రాత్రే లక్షాధికారులు.. కాదు కాదు.. కోటీశ్వరులుగా మారిపోతున్నారు. బ్యాంకు సిబ్బంది నుంచి దళారులు, రాజకీయ నాయకుల వరకు అందరూ ‘నలుపు’ను ‘తెలుపు’గా మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి ప్రజలకు చేరాల్సిన సొమ్మును ‘పెద్దల’ బోషాణాలకు తరలిస్తున్నారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఇందులో కలిసికట్టుగా సాగుతుండడం విశేషం. పార్టీలు వేరైనా ప్రజలను ముంచే విషయంలో తామంతా ఒకే తాటిపై ఉంటామని నిరూపించారు. ‘ఇండియా టుడే’ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో రాజకీయ నాయకులు కప్పుకున్న ప్రజాసేవ తోలు అసలు రంగు బయటపడింది. 40 శాతం కమిషన్ ఇస్తే ఎంత భారీ మొత్తాన్నైనా క్షణంలో ‘వైట్’ చేస్తామంటూ పలువురు నాయకులు ముందుకు వచ్చారు. నల్ల కుబేరులుగా విలేకరులు వారిని సంప్రదించినప్పుడు వారి అసలు రంగు బయటపడింది.
మొదట ఓ విలేకరి ఘజియాబాద్‌లోని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు వీరేంద్ర జాదవ్ వద్దకు వెళ్లి తనను తాను వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్నాడు. పరిస్థితి వివరించాడు. 40 శాతం కమీషన్‌తో రూ. పది కోట్ల వరకు మార్చి ఇస్తానని వీరేంద్ర అతడికి భరోసా ఇచ్చాడు. అయితే 40 శాతం కంటే తక్కువ కమీషన్‌పై మాత్రం ఆ పని చేయలేనని తేల్చి చెప్పడం గమనార్హం. ముందు రూ.10 కోట్ల పాత నోట్లు తెస్తే రూ. వెంటనే రూ.6 కోట్లు చేతిలో పెడతానని, అన్నీ కొత్త నోట్లేనని చెప్పుకొచ్చారు. అది కూడా ‘హ్యాండ్ టు హ్యాండ్’ అని చెప్పడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని అధికార ఎస్పీ నేత టిటూ యాదవ్ కూడా డబ్బులు మార్చి ఇస్తానని హామీ ఇచ్చారు.
‘‘మీరు ఎన్ని డబ్బులైనా తీసుకురండి. ఇట్టే మార్చి ఇచ్చేస్తా. నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు ఓ ఎన్జీవో వద్దకు తీసుకెళ్తా. కోటి రూపాయలైనా సరే మార్చేద్దాం’’ అని ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద ఆ పార్టీ నేత తారిక్ సిద్ధికీ భరోసా ఇచ్చారు. ‘‘నల్లడబ్బు మార్చేందుకు బోలెడన్ని మార్గాలున్నాయి కానీ నాకైతే పక్కాగా తెలీదు. స్వచ్ఛంద సంస్థ వద్ద మాత్రం పని చాలా సులభంగా అయిపోతుంది’’ అని ఆయన పేర్కొనడం గమనార్హం.
30 శాతం కమీషన్ ఇస్తే కోటి రూపాయలు మార్చేందుకు రెడీ అంటూ ఢిల్లీలోని ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి రవికుమార్ హామీ ఇచ్చారు. అంతేకాదు ఆ 70 శాతానికి తాను గ్యారెంటీ అంటూ భరోసా ఇచ్చారు. ఆ 70 శాతానికి వెంటనే చెక్కు కూడా ఇస్తానని పేర్కొన్నారు. చెక్కు ‘వైట్’ ఎలా అవుతుందన్న దానికి కూడా ఆయన ఓ సలహా పడేశారు. ‘‘మీ పేరిట ఓ నకిలీ పీఆర్ కంపెనీ సృష్టించి దానికి పే చేస్తే సరి’’ అంటూ ఉచిత సలహా ఇచ్చారు. అంతేకాదు ఎన్నికల్లో ప్రచారానికి ఈ కంపెనీని ఉపయోగించుకున్నట్టు చూపిస్తామని, దాని వల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడు కన్వర్ ప్రతాప్‌సింగ్ మాత్రం వాయిదాల రూపంలో రూ.70 లక్షలు ఇస్తానని, చెక్ అంటే కష్టమని పేర్కొనడం గమనార్హం.
జేడీయూ కార్యాలయంలోని ఢిల్లీశాఖ ఉపాధ్యక్షుడు సతీశ్ సైనీ కూడా పాత నోట్లను మార్చి ఇచ్చేందుకు సిద్ధమని పేర్కొన్నారు. ఎంత సొమ్ము మార్చాలో చెబితే దానిని బట్టి కమీషన్లు మాట్లాడుకోవచ్చని చెప్పారు. పది కోట్ల రూపాయలను 40 శాతం కమీషన్‌తో మార్చి ఇస్తానని హామీ ఇచ్చారు. బేరమాడితే 30 శాతం కమీషన్‌కు ఓకే చెప్పడం గమనార్హం.
ఓ పక్క రూ. 2 వేలు.. కేవలం రెండు వేల రూపాయలు దొరక్క రోజుల తరబడి జనం బ్యాంకుల ముందు పడిగాపులు పడుతుంటే ప్రజాసేవ చేస్తామంటూ గొంతు పగిలేలా చెప్పే నేతలు చేస్తున్న పని ఇదేనని పత్రిక పేర్కొంది.