: ఇంకా చీకట్లోనే చెన్నై.. భారీ ఆస్తినష్టం మిగిల్చిన ‘వార్దా’.. రూ. వెయ్యి కోట్లు పంపాలంటూ కేంద్రానికి సీఎం లేఖ
‘వార్దా’ మిగిల్చిన బీభత్సానికి చెన్నైలో ఇంకా వణుకు తగ్గలేదు. కూలిన వృక్షాలు, విరిగిన విద్యుత్ స్తంభాలు, ధ్వంసమైన వాహనాలు.. నగరంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. తుపాను దాటికి మరణించిన వారి సంఖ్య మంగళవారానికి 18కి చేరింది. దాదాపు 50 వేల విద్యుత్ స్తంభాలు కూలడంతో నగరం ఇంకా అంధకారంలోనే ఉంది. నేటి సాయంత్రానికి విద్యుత్‌ను పునరుద్ధరించే అవకాశం ఉంది. ప్రభుత్వ ముందస్తు చర్యల వల్ల భారీ ప్రాణనష్టం తగ్గింది. తుపాను దెబ్బకు రూ.10 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా. తుపానుతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు వెంటనే రూ.1000 కోట్లు పంపాలంటూ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధాని మోదీకి లేఖ రాశారు.
ఇక తుపాను దెబ్బకు చిగురుటాకులా వణికిన కాంచీపురం, కడలూరు, తిరువళ్లూరు కోలుకోవడానికి మరికొన్ని రోజులు పడుతుంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలో ప్రభుత్వ పాఠశాలలకు నేడు (బుధవారం) కూడా సెలవు ప్రకటించారు. రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్ఎఫ్ బలగాలు, ఫైర్ సిబ్బంది, చెన్నై కార్పొరేషన్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. సహాయ కార్యక్రమాలపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ముందస్తు చర్యల వల్లే భారీ ప్రాణ నష్టాన్ని తప్పించగలిగామంటూ అధికారులను మంత్రి అభినందించారు.