: పనిగట్టుకొని పోలవరం ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్నారు: వైసీపీ నేతలపై మంత్రి దేవినేని ఫైర్
పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు వెలగపుడిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ... పోలవరం పనులపై విమర్శలు గుప్పిస్తోన్న వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు పనిగట్టుకొని పోలవరం ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఏదో విధంగా తమపై బురద చల్లాలన్న లక్ష్యంతోనే వైసీపీ పనిచేస్తోందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు అధికారులు, జలవనరుల శాఖ అధికారులు భూసేకరణ చట్టానికి అనుగుణంగా కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. కొత్త చట్టం ఆధారంగానే రైతులకు నష్టపరిహారం చెల్లించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టును తాము వేగంగా నిర్మిస్తోంటే వైసీపీ నేతలు మాత్రం వాటి పనులను అడ్డుకోవాలని చూస్తున్నారని దేవినేని ఉమా మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు జరుగుతుంటే వైసీపీ నేతలు అసహనంతో వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఎన్నో కేసుల్లో ముద్దాయిగా ఉన్న అవినీతిపరుడు జగన్ రాష్ట్రాభివృద్ధి జరగకుండా ఎన్నో కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.