: ప్రియుడికి సాయం చేసి.. ఆపై కట్టుకథ అల్లిన యువతి!
తన ఒంటిపైనున్న బంగారాన్ని ప్రియుడికి ఇచ్చేసి, కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా వుండడం కోసం ఓ యువతి ఆడిన దొంగతనం డ్రామా బట్టబయలైంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... నెల్లూరు జిల్లా కేంద్రంలోని కాకర్లవారి వీధిలో నివాసముండే పూజా సింగ్ అనే యువతి రమీజ్ షా అనే యువకుడితో ప్రేమలో ఉంది. రమీజ్ షా తనకు డబ్బు అవసరం ఉందని చెప్పడంతో తన దగ్గర ఉన్న 1270 గ్రాముల బంగారం అతనికి ఇచ్చింది. అనంతరం ఇంట్లో వారికి తన బంగారం చోరీకి గురైందని ఒక కట్టుకథ అల్లి చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆమె చెబుతున్న కథ నమ్మశక్యం కాకపోవడంతో ఆమెను విచారించిన పోలీసులు నెమ్మదిగా కూపీ లాగారు. దీంతో పూజా సింగ్ తను చేసిన నిర్వాకాన్ని వారికి వివరించింది. దీంతో రమీజ్ షాను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి ఆమె ఇచ్చిన బంగారం స్వాధీనం చేసుకున్నారు.