: చిత్ర‌హింస‌ల‌కు గుర‌వుతున్న‌ మ‌హిళ‌ను దేవుడిలా వ‌చ్చి కాపాడిన కొరియ‌ర్ బోయ్!


ఇంట్లో భ‌ర్త నుంచి చిత్ర‌హింస‌ల‌కు గుర‌వుతున్న ఓ మ‌హిళ‌ను ఓ కొరియ‌ర్ బాయ్ కాపాడిన ఘ‌ట‌న అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో గల ఫ్రాంక్లిన్ కౌంటీలో చోటు చేసుకుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లనివ్వకుండా స‌ద‌రు మ‌హిళ‌ను ఆమె భ‌ర్త చావ‌గొడుతున్నాడు. సుమారు 15 గంటల పాటు ఆమెను దారుణంగా కొడుతూ, లైంగికంగా వేధిస్తున్నాడు.  అంతేగాక ఆమె తలకు తుపాకి గురిపెట్టి చంపేస్తాన‌ని, అనంత‌రం తాను కూడా కాల్చుకుంటాన‌ని బెదించాడు. చివ‌ర‌కు ఆ ఇంటి నుంచి ఓ ప్యాకేజి తీసుకోడానికి కొరియర్ బోయ్ వచ్చి త‌లుపుత‌ట్టాడు. కొరియ‌ర్ బోయ్‌తో మాట్లాడి పంపించేయ‌డానికి ఆ మ‌హిళ వ‌చ్చింది. అయితే, త‌లుపు వెన‌క నుంచి ఆ మ‌హిళ‌కు తుపాకి గురిపెట్టి ఆమె భ‌ర్త నిల‌బ‌డ్డాడు.

కొరియ‌ర్ బోయ్‌తో ఏమీ చెప్పుకోలేని స్థితిలో ఉన్న ఆమె అతనికి ఇచ్చే బాక్సు మీద కాంటాక్ట్ 911 (అక్క‌డి పోలీస్ కంట్రోల్ రూం నెంబ‌రు) అని మాత్రం రాసి ఇచ్చింది. ఆ బాక్సును అందుకున్న‌ ఆ కొరియర్ బోయ్ ఆమె స్థితిని అర్థం చేసుకున్నాడు. అక్క‌డి నుంచి వెళ్లి పోలీసులకు ఫోన్ చేసి ఆ మ‌హిళ ఇంటి వద్ద‌కు పోలీసులను తీసుకువ‌చ్చాడు. దీంతో ఆ మ‌హిళ త‌న భ‌ర్త పెడుతున్న చిత్ర‌హింస‌ల నుంచి బ‌య‌ట‌ప‌డింది. మ‌హిళ‌ను ర‌క్షించిన‌ ఆ కొరియర్‌ బోయ్‌ని ఇప్పుడు అక్క‌డి వారంతా హీరోగా అభివ‌ర్ణిస్తున్నారు. కొరియ‌ర్ బోయ్ త‌మ‌కు ఈ స‌మాచారం అందించ‌క‌పోతే విషయం తమకు తెలిసేది కాదని  పోలీసులు అన్నారు. కొరియ‌ర్ బోయ్ తాను ప‌నిచేస్తోన్న కంపెనీ నుంచి కూడా ప్ర‌శంస‌లు అందుకున్నాడు.

  • Loading...

More Telugu News