: కోహ్లీని తప్పుబట్టేంత స్థాయి నీకు ఉందా?: ఆండర్సన్ పై మండిపడ్డ ఇంజిమామ్
టీమిండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్ ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన ఇంగ్లండ్ పేస్ బౌలర్ ఆండర్సన్ పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్, పాక్ క్రికెట్ బోర్డ్ చీఫ్ సెలక్టర్ ఇంజిమామ్ ఉల్ హక్ మండిపడ్డాడు. కోహ్లీ టెక్నిక్ ను తప్పుబట్టేంత స్థాయి ఆండర్సన్ కు లేదని చెప్పాడు. కోహ్లీ బ్యాటింగ్ ను విమర్శించే ముందు... ఇండియాలో వికెట్లు ఎలా తీయాలో తెలుసుకోవాలని సూచించాడు. ఆండర్సన్ వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని... ఇండియాలో ఆండర్సన్ వికెట్లు తీయడాన్ని తానెప్పుడూ చూడలేదని ఎద్దేవా చేశాడు.
తన బౌలింగ్ ను ఇంగ్లండ్ లో కోహ్లీ ఎదుర్కోలేకపోయాడన్న ఆండర్సన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఇంగ్లండ్ లో ఆడితేనే మంచి బ్యాట్స్ మెన్ అనే సర్టిఫికెట్ ఇస్తారా? అని ప్రశ్నించాడు. ఉపఖండపు పిచ్ లపై ఆడేటప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ తరహా వ్యాఖ్యలు చేయరాదని... దాని వల్ల వారే ఇబ్బందుల్లో పడతారని అన్నాడు. ఒక ఆటగాడు ఎక్కడ పరుగులు చేసినా... వాటిని పరుగులుగానే పరిగణిస్తారన్న విషయాన్ని ఆండర్సన్ లాంటి ఆటగాళ్లు తెలుసుకోవాలని చెప్పాడు.